Kamareddy District: తల్లిని చంపేందుకు ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు.. బయటి నుంచి వచ్చిన తల్లిని చూసి పరార్

man try to kill his mother for money in kamareddy
  • డబ్బుల కోసం కన్నతల్లినే హతమార్చాలని యత్నించిన వ్యక్తి
  • ఇంట్లో లేకపోవడంతో బతికిపోయిన బాధితురాలు
  • రూ.1.20 లక్షలు, 8 తులాల బంగారం కాలి బూడిదయ్యాయని ఆవేదన 
  • కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ఘటన

డబ్బుల కోసం కన్నతల్లినే హతమార్చాలని చూశాడో ప్రబుద్ధుడు. తల్లి లోపల ఉందనుకుని బయటి నుంచి ఇంటికి నిప్పటించాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆమె అక్కడ లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో జరిగిందీ ఘటన.

బీర్కూర్‌ కు చెందిన గవ్వల చంద్రవ్వ, నారాయణ దంపతులకు ఒకే కొడుకు అశోక్‌. నారాయణ గతంలో చనిపోగా.. అశోక్‌ హైదరాబాద్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. తల్లి చంద్రవ్వ బీర్కూర్‌ లో ఒక్కటే ఉంటోంది. అశోక్‌ నిత్యం డబ్బుల కోసం చంద్రవ్వను వేధించేవాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయాలని గొడవ చేసేవాడు.

ఈ నేపథ్యంలో అశోక్‌ సోమవారం మధ్యాహ్నం బీర్కూర్‌ చేరుకున్నాడు. తల్లి ఇంట్లో ఉందని భావించి.. బయటి నుంచి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో తల్లి చంద్రవ్వ బయటి నుంచి రావడాన్ని చూసిన అశోక్‌ అక్కడి నుంచి పారిపోయాడు.

ఇంటికి నిప్పంటించడంతో ఇటీవల ధాన్యం విక్రయించిన డబ్బులు రూ.1.20 లక్షలు, 8 తులాల బంగారం కాలి బూడిదైనట్టు ఆమె వాపోయింది. మూడు నెలల క్రితం కూడా తనపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాలని ప్రయత్నించాడని, త్రుటిలో తప్పించుకున్నట్టు చెప్పింది. హైదరాబాద్‌ నుంచి వచ్చినప్పుడల్లా అశోక్‌ తనను విపరీతంగా కొడతాడని, డబ్బుల కోసం వేధిస్తాడని తల్లి చంద్రవ్వ వాపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News