Andhra Pradesh: నాలుగు రోజుల టైం కావాలంటూ సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ

  • వైఎస్ వివేకా హత్య కేసులో విచారణకు రమ్మంటూ సీబీఐ నోటీసులు
  • అత్యవసర పనులు ఉండడం వల్ల రాలేనంటూ ఎంపీ లేఖ
  • ఎంపీ విజ్ఞప్తిపై స్పందించని సీబీఐ అధికారులు
AP mp avinash reddy writes letter to CBI

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు (మంగళవారం) విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని అందులో వివరించారు. అత్యవసర పనుల కారణంగానే విచారణకు రాలేకపోతున్నానని, నాలుగు రోజుల గడువు కావాలని కోరారు. 

నేటి ఉదయం జూబ్లీహిల్స్ లోని తన నివాసం ముందు అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉందని, అందుకోసమే ప్రస్తుతం పులివెందుల వెళుతున్నానని ఎంపీ చెప్పారు. అయితే, అవినాశ్ విజ్ఞప్తిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏం జరగనుందోననే ఉత్కంఠ నెలకొంది.

వివేకా హత్య కేసులో విచారణకు రావాలంటూ ఎంపీ అవినాశ్ రెడ్డికి సోమవారం సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు ఎంపీని విచారించి, స్టేట్ మెంట్ రికార్డు చేశారు. దాదాపు 20 రోజుల విరామం తర్వాత తాజాగా మరోమారు విచారణకు రమ్మంటూ నోటీసులు జారీ చేశారు. మరోవైపు, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాశ్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.

More Telugu News