Nara Lokesh: నారా, నందమూరి కుటుంబ సభ్యులతో ​ఘనంగా లోకేశ్ 100వ రోజు పాదయాత్ర

  • శ్రీశైలం నియోజకవర్గంలో యువగళం
  • 100వ రోజు పాదయాత్రలో లోకేశ్ తో పాటు నారా భువనేశ్వరి తదితరులు
  • నారా, నందమూరి కుటుంబ సభ్యులను చూసేందుకు పోటెత్తిన ప్రజలు
  • ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన లోకేశ్
  • చెంచులతో లోకేశ్ ముఖాముఖి
Lokesh Padayatra reached 100th day milestone

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజు ప్రభంజనంలా సాగింది. శ్రీశైలం నియోజకవర్గంలో బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర జాతరను తలపించింది. టీడీపీ కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ యువగళం 100వ రోజు పాదయాత్ర సాగింది. 

లోకేశ్ తో కలిసి ఆయన తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబసభ్యులు అడుగులు వేశారు. జై లోకేశ్, జై తెలుగుదేశం నినాదాలతో యువగళం పాదయాత్ర మార్గం హోరెత్తింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది. 

యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ ఓ పైలాన్ ను ఆవిష్కరించారు. 100 రోజుల పాదయాత్ర కు గుర్తుగా టీడీపీ నేతలు 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఇన్చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు జ్జాపికను యువనేతకు అందజేశారు. లోకేశ్ పాదయాత్ర లో నారా భువనేశ్వరి, కుటుంబ సభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి దేవన్, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కాటమనేని దీక్షిత, కాటమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. 

100 రోజుల యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా క్యాంప్ సైట్ లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, మహిళా అధ్యక్షురాలు షకీలా రెడ్డి, యువత అధ్యక్షుడు పొగాకు జైరాం తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సంతజూటూరులో చెంచు సామాజిక వర్గీయులతో యువనేత సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు.

ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన లోకేశ్

యువ‌గ‌ళం పాద‌యాత్ర అరాచ‌క స‌ర్కారుపై జ‌న‌జైత్రయాత్రగా చ‌రిత్రలో నిలిచిపోతుంద‌ని టీడీపీ నేత‌లు పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం వందరోజులు పూర్తయిన సంద‌ర్భంగా పాద‌యాత్ర విశేషాల‌తో టీడీపీ నేత కేశినేని శివ‌నాథ్(చిన్ని) ప్రత్యేక సంచిక తీసుకొచ్చారు. లోకేశ్ శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గం బోయరేవుల క్యాంప్ సైట్ వ‌ద్ద సోమ‌వారం ప్రత్యేక సంచిక "జ‌న‌హృద‌య‌మై నారా లోకేశ్"ని ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి, మాజీ మంత్రి పీత‌ల సుజాత‌, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్చార్జి బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, డూండి రాకేష్, యువగళం మీడియా కోఆర్డినేటర్ బీవీ వెంకట రాముడు, భాష్యం ప్రవీణ్‌, ఇతర టీడీపీ నేత‌లు పాల్గొన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలో చెంచులకు పక్కా ఇళ్లు

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెంచుల కోసం ప్రత్యేక ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. సంతజూటూరులో చెంచు సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... చెంచులకు ప్రత్యేక అటవీ హక్కులు ఉన్నాయి.... మీ హక్కులు కాలరాసే అధికారం ఎవరికీ లేదు అని స్పష్టం చేశారు. 

"టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అడవికి వెళ్లి స్వేచ్ఛగా ఫలసాయాన్ని పొందే హక్కు కల్పిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెంచు గూడెంలో పక్కా ఇళ్లు, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. ఐటీడీఏ ద్వారా అందే అన్ని సంక్షేమ కార్యక్రమాలను చెంచులకు అందజేస్తాం. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ చెయ్యడానికి ప్రత్యేక అవుట్ లెట్స్ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తాం. 

ఎకో టూరిజం ఏర్పాటు చేసి గిరిజనులు, చెంచులకి ప్రయోజనాలు కలిగేలా చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని చెంచు గూడెంలను అభివృద్ది చేసే బాధ్యతని నేను తీసుకుంటా" అని భరోసా ఇచ్చారు.


*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1283 కి.మీ.*

*ఈరోజు నడిచింది దూరం 14.1 కి.మీ.*

*101వ రోజు (16.05.2023) పాదయాత్ర వివరాలు*

*శ్రీశైలం/నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు(నంద్యాల జిల్లా)*

సాయంత్రం

4.00 – బండి ఆత్మకూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – పర్నపల్లెలో లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరికలు.

6.05 – ఎ.కోడూరులో స్థానికులతో మాటామంతీ.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.

6.30 – కొత్తపల్లిలో స్థానికులతో మాటామంతీ.

7.05 – కొత్తపల్లిలో స్థానికులతో సమావేశం.

8.45 – కొత్తపల్లిలో నిలచిపోయిన కాపుభవన్ సందర్శన.

9.00 – మూలమట్టం విడిది కేంద్రంలో బస.

******

More Telugu News