Varla Ramaiah: పప్పు... పప్పు అని ఎవరినైతే అవమానించారో ఆ వ్యక్తే మీ పాలిట నిప్పుకణికలా మారాడు సీఎం గారూ!: వర్ల రామయ్య

  • లోకేశ్ కు సంఘీభావంగా పాదయాత్రలు
  • ప్రభుత్వం ఉలిక్కిపడిందన్న వర్ల రామయ్య
  • లోకేశ్ పాదయాత్ర 300 రోజులు పూర్తయితే జగన్ పని అవుట్ అని వెల్లడి
  • వైసీపీ పెద్దలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని వ్యాఖ్యలు
Varla Ramaiah hails Nara Lokesh

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఎం జగన్ పైనా, ఇతర వైసీపీ నేతలపైనా నిప్పులు చెరిగారు. పప్పు... పప్పు అని ఎవరినైతే అవమానించారో, ఎవరినైతే హేళన చేశారో, ఇప్పుడా వ్యక్తే నిప్పు కణికలా మారి అగ్నిగుండమై మిమ్మల్ని దహించడానికి సిద్ధమయ్యాడు ముఖ్యమంత్రి గారూ అంటూ వర్ల రామయ్య హెచ్చరించారు. 

నారా లోకేశ్  పాదయాత్రకు సంఘీభావంగా నేడు రాష్ట్రంలోని 173 నియోజకవర్గాల్లో జరిగిన పాదయాత్రలు, కార్యక్రమాలు చూసి అధికార పార్టీ ఉలిక్కిపడిందని అన్నారు. 400 రోజులు, 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి సంకల్పించిన ఆ బిడ్డను ఆశీర్వదించడం కోసం, ఆ బిడ్డకు మద్దతు పలకడం కోసం, ఆ బిడ్డకు ధైర్యం పలకడంకోసం, ఆ బిడ్డను వీపు తట్టి ప్రోత్సహించడం కోసం నేడు సంఘీభావయాత్రలు జరిగాయని వెల్లడించారు. 

రాష్ట్రంలో జరిగిన సంఘీభావయాత్రలు చూశాక మీ వెన్నులో చలి రావడం లేదా? నిజం చెప్పండి సజ్జల గారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి... మీరు దిక్కుతోచని స్థితిలో లేరా? అని నిలదీశారు. పాదయాత్రలో 300 రోజులు, 2,740 కిలోమీటర్లు పూర్తయితే  మీ పని అవుట్ జగన్మో హన్ రెడ్డిగారు, సజ్జల రామకృష్ణారెడ్డిగారు... మరలా మీరు, మీ గుమస్తాగిరికి వెళ్లడమే అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

రాష్ట్రంలో అభివృద్ధి లేదని, సంక్షేమం లేదని, అన్ని వర్గాల ప్రజలు మీ పాలనను ఈసడించుకుంటున్నారు అని వర్ల రామయ్య విమర్శించారు. "అమ్మఒడి తీసుకున్న అమ్మ కూడా నా బిడ్డ భవిష్యత్ నాకు ముఖ్యమని భావించి, అది చంద్రబాబు నాయుడు, ఆయన బిడ్డ నారా లోకేశ్ వల్లే సాధ్యమని నమ్ముతోంది. ఇది నిజం కాదని చెప్పే ధైర్యముందా మీకు? మీరు ఓపెన్ డిబేట్ కు వస్తారా?" అని వర్ల రామయ్య సవాల్ విసిరారు. 

"ఆ బిడ్డ జనవరి 27వ తేదీన బయలుదేరినప్పుడు ఎంత ఎగతాళి చేశారండీ మీరు? ఎంత అవహేళన చేశారండీ మీరు? అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ లో చెబుతారు. నిషేధించిన రాయి, నిరాకరించిన రాయి, వద్దనుకున్న రాయి, మూలకు తలరాయిగా మారుతుందని ఆ ప్రభువైన ఏసుక్రీస్తు చెప్పడం జరిగింది. 

ఆనాడు పప్పు పప్పు అని ఎగతాళిచేసిన వారికి, ఈ రోజున అదిపప్పుకాదు, నిప్పుకణిక అని అర్థమైంది. దాంతో అధికార పార్టీ ఉలిక్కిపడింది, కంగారుపడింది. అధికార పార్టీ దిక్కుతోచని స్థితికి చేరింది. ఏమిటి మనగతి అని ఆలోచించుకునే స్థితికి చేరింది అధికార పార్టీ. ఆ నిప్పు కణిక అధికారపార్టీని మంటల్లో మలమలా కాల్చడానికి సిద్ధంగా ఉందని తెలియచేసిన నారా లోకేశ్ కి తెలుగుదేశం పార్టీ, 70 లక్షల మంది కార్యకర్తలు కూడా అభినందనలు తెలియచేస్తున్నారు" అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

More Telugu News