Siddaramaiah: మెజారిటీ ఎమ్మెల్యేలు నన్నే సీఎంగా కోరుకుంటున్నారు.. సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Majority of Congress MLAs backed me for Karnataka CM post says Siddaramaiah
  • డీకే శివ‌కుమార్‌తో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌న్న సిద్ధరామయ్య
  • ఆయ‌న‌తో వ్య‌క్తిగ‌తంగా మంచి సంబంధాలు ఉన్నాయ‌ని వెల్లడి
  • పార్టీ హైక‌మాండ్‌తో చ‌ర్చించేందుకు ఇప్పటికే ఢిల్లీకి మాజీ సీఎం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులు దాటింది. ఇప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారు కాలేదు. సిద్ధరామయ్యా? శివకుమారా? అనే ఉత్కంఠకు తెరపడలేదు. ఈ విషయంలో అధిష్ఠానం స్పష్టతకు రాలేకపోతోంది. చర్చోపచర్చలు జరుపుతూనే ఉంది. మరోవైపు డీకే శివకుమార్, సిద్ధరామయ్య తమ ప్రయత్నాలు తాము కొనసాగిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ న్యూస్ చానల్ తో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తననే సీఎంగా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కర్ణాటక సీఎం రేసులో ఉన్న డీకే శివ‌కుమార్‌తో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని, ఆయ‌న‌తో వ్య‌క్తిగ‌త సంబంధాలు మెరుగ్గా ఉన్నాయ‌ని సిద్ధ‌రామ‌య్య చెప్పారు. 

‘‘జాతీయ రాజకీయాల్లో ఇదొక మలుపు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని, చేతులు కలపాలని కోరుతున్నా’’ అని అన్నారు. మ్యానిఫెస్టోలో పొందుప‌రిచిన హామీల‌న్నీ నెర‌వేరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కర్ణాటక సీఎం వ్య‌వ‌హారంపై పార్టీ హైక‌మాండ్‌తో చ‌ర్చించేందుకు ఆయ‌న ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.

మరోవైపు సీఎం ప‌ద‌విని చెరి రెండున్న‌రేండ్లు పంచుకోవాల‌నే ప్ర‌తిపాద‌నను డీకే శివ‌కుమార్ తోసిపుచ్చినట్టు స‌మాచారం. రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గఢ్ ఉదంతాల‌ను ఉటంకిస్తూ డీకే ఈ ప్ర‌తిపాద‌న‌ను తిరస్కరించినట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Siddaramaiah
DK Shivakumar
Karnataka CM post
Congress
Delhi

More Telugu News