KA Paul: పది పార్టీలు మారావు పవన్... నీకసలు స్థిరత్వం ఉందా?: కేఏ పాల్

  • వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందన్న పవన్
  • పవన్ ప్రకటనతో అందరూ షాకయ్యారన్న కేఏ పాల్
  • తానేమీ షాక్ కు గురికాలేదని వెల్లడి
  • పవన్ ప్యాకేజి స్టార్ అని ముందు నుంచి చెబుతున్నానని వ్యాఖ్యలు
KA Paul take a jibe at Pawan Kalyan

వచ్చే ఎన్నికల్లో అన్ని సమీకరణాలు అనుకూలిస్తే బీజేపీ, టీడీపీలతో కలిసి జనసేన కూటమి కడుతుందని పవన్ కల్యాణ్ ప్రకటించడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో అందరూ షాకయ్యారని, కానీ తాను మాత్రం షాక్ కు గురికాలేదని తెలిపారు. 

పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజి స్టార్ అని, దశావతారాలు ఎత్తుతాడని తాను ముందు నుంచి చెబుతున్నానని కేఏ పాల్  అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేశాయని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్రత్యేక ప్యాకేజి ఇవ్వలేదని, రూ.4 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ను రూ.4 వేల కోట్లకే అమ్మేస్తున్నారని విమర్శించారు. ఓట్లు చీలిపోకుండా జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికే పొత్తు అని పవన్ కారణాలు చెబుతున్నాడని వెల్లడించారు. 

"మనల్ని నాశనం చేసింది మోదీ, బీజేపీ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి బీజేపీ 'బి' పార్టీలు. అందుకే అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు. ఇంకా చేరనివారు, తెలివైనవారు ఎవరైనా ఉంటే వెంటనే చేరండి" అని కేఏ పాల్ పిలుపునిచ్చారు. 

అనంతరం పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. "2008లో ప్రజారాజ్యం, 2011లో కాంగ్రెస్ లో విలీనం, ఆ తర్వాత జనసేన ఏర్పాటు, 2014లో టీడీపీ, బీజేపీలతో కూటమి, 2019లో సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో జోడీ, మళ్లీ 2019 తర్వాత బీజేపీ, టీడీపీతోనా! ఇవి దశావతరాలు కావా... నీకు స్థిరత్వం ఉందా? చిరంజీవి ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ లో విలీనం చేసి మంత్రి పదవి చేపట్టారు. నువ్వు ఎమ్మెల్యే కూడా కాకముందే పది పార్టీలు మారావు. అందుకే బీసీలు, కాపులు, దళితులు ఎవరూ నమ్మడంలేదు. 

ఎన్టీఆర్ ను మోసం చేశాడని చంద్రబాబునాయుడ్నే ఎవరూ నమ్మడంలేదు. ఏపీలో చంద్రబాబు పార్టీ కూడా బీజేపీకి 'బి' పార్టీగా మారిపోయింది. పవన్ ద్వారా చంద్రబాబు డ్రామాలు ఆడిస్తున్నాడు" అంటూ కేఏ పాల్ ధ్వజమెత్తారు.

More Telugu News