Praveen Sood: సీబీఐ నూతన డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్

  • ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్
  • సూద్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
  • సూద్ ను సీబీఐ బాస్ గా ఎంపిక చేసిన ప్రధాని మోదీ కమిటీ
  • రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్ గా కొనసాగనున్న సూద్
Praveen Sood appointed as CBI new director

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కొత్త డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ప్రవీణ్ సూద్ ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ఆయన 2020లో కర్ణాటక డీజీపీ బాధ్యతలు చేపట్టారు. ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని హైపవర్ సెలెక్షన్ కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్ గా ఎంపిక చేసింది. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైస్వాల్ కొనసాగుతున్నారు. జైస్వాల్ పదవీకాలం ముగిసిన వెంటనే ప్రవీణ్ సూద్ బాధ్యతలు అందుకుంటారని కేంద్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది. 

ప్రవీణ్ సూద్ ఐఐటీ ఢిల్లీ విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత పోలీస్ విభాగంలో ప్రవేశించిన ఆయన 1989లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా పనిచేశారు. పదోన్నతిపై బెంగళూరు నగర డీసీపీగా వచ్చారు. 

1999లో డిప్యుటేషన్ పై మారిషస్ దేశానికి పోలీస్ సలహాదారుగా నియమితులయ్యారు. మారిషస్ లో ఆయన మూడేళ్ల పాటు పనిచేశారు. 2004-2007 మధ్య కాలంలో ప్రవీణ్ సూద్ మైసూరు పోలీస్ కమిషనర్ గా వ్యవహరించారు. ఇక్కడ పాక్ సంతతి టెర్రరిస్టులను అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. 

ఆయన సేవలకు గుర్తింపుగా పలు విశిష్ట పురస్కారాలు కూడా వరించాయి. 1996లో చీఫ్ మినిస్టర్ గోల్డ్ మెడల్, 2002లో పోలీస్ మెడల్, 2011లో ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్, 2006లో ప్రిన్స్ మైకేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు, 2011లో నేషనల్ ఈ-గవర్నెన్స్ స్వర్ణ పురస్కారం అందుకున్నారు. 

అంతేకాదు, ప్రవీణ్ సూద్ కర్ణాటక హోం శాఖ ముఖ్య కార్యదర్శి, అడిషనల్ డీజీపీగానూ, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గానూ వ్యవహరించారు.

More Telugu News