Chandrababu: విద్యుత్ సంస్కరణల కారణంగా అధికారం కూడా కోల్పోయాను: చంద్రబాబు

  • సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీలో స్నాతకోత్సవం
  • హాజరైన చంద్రబాబు
  • పబ్లిక్ పాలసీ స్నాతకోత్సవానికి హాజరవడం ఇదే ప్రథమం అని వెల్లడి
  • విజన్ 2020 ప్రస్తావించిన చంద్రబాబు
  • ఇప్పుడు విజన్ 2047పై దృష్టి సారించాలని పిలుపు
Chandrababu attends GITAM University convocation

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థ స్నాతకోత్సవానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన 'విధానాల రూపకల్పన, సంస్కరణలు, పరిపాలనలో టెక్నాలజీ' అంశాలపై ప్రసంగించారు. 

పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి హాజరవడం తనకు ఇదే మొదటిసారి అని తెలిపారు. పబ్లిక్ పాలసీ సంస్థకు కౌటిల్య అని మంచి పేరు పెట్టారని, కౌటిల్యుడి పేరు ఈ విద్యాసంస్థకు అతికినట్టు సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కౌటిల్యుడి పేరు నిలబెట్టేలా విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయడంలో పబ్లిక్ పాలసీ అనేది చాలా కీలక అంశం అని వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో దేశంలో అభివృద్ధి రేటు అత్యంత కనిష్ఠ స్థాయిలో ఉండేదని చంద్రబాబు తెలిపారు. 

"పాతికేళ్ల కిందట నేను విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు నవ్వుకున్నారు. కొందరైతే విజన్ 2020ని విజన్ 420 అని ఎగతాళి చేశారు. నేను ప్రతిపాదించిన విజన్ 2020 ఇప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కనిపిస్తోంది. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అవుతుంది" అని చంద్రబాబు వివరించారు. 

తాను 1978లో తొలిసారి ఎమ్మెల్యేని అయ్యానని, అప్పట్లో శాసనసభ్యులకు జీపు ఇచ్చేవారని వెల్లడించారు. అప్పటి రోడ్లలో జీపులు నడిపేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదని చెప్పారు. ఇప్పుడందరూ ఆధునిక భారతదేశాన్ని చూస్తున్నారని తెలిపారు. 

"దేశ ప్రగతి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే... సంస్కరణలకు ముందు, సంస్కరణలకు తర్వాత అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనది ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. మరికొన్నేళ్లలో మనది ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలి. మన తలసరి ఆదాయం 26 వేల డాలర్లుగా ఉండాలి. యువత తలుచుకుంటే 2047 నాటికి భారత్ ను ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడం సాధ్యమే" అని అభిప్రాయపడ్డారు. 

కాగా, విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చిన సమయంలో చాలామంది హెచ్చరించారని చంద్రబాబు వెల్లడించారు. విద్యుత్ సంస్కరణల కారణంగా తాను అధికారం కూడా కోల్పోయానని అన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణల రూపకల్పనలో తనది కీలకపాత్ర అని స్పష్టం చేశారు. టెలికమ్యూనికేషన్ల రంగంలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చామని, ఆ సంస్కరణల ఫలితాలు ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని తెలిపారు. 

దేశంలోనే మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు శంషాబాద్ లో నిర్మించామని, శంషాబాద్ ఎయిర్ పోర్టు కోసం దేశంలోని 20 ఎయిర్ పోర్టులను స్వయంగా పరిశీలించానని చంద్రబాబు వివరించారు. 

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను కలిసేందుకు ఎంతో శ్రమపడాల్సి వచ్చిందని అన్నారు. రాజకీయనేతలను కలవడంపై ఆసక్తి లేదంటూ బిల్ గేట్స్ మొదట్లో తనతో భేటీకి అంగీకరించలేదని చంద్రబాబు వెల్లడించారు. అయితే అతి కష్టమ్మీద బిల్ గేట్స్ తో 10 నిమిషాల భేటీకి అపాయింట్ మెంట్ సంపాదించగలిగానని, ఆ 10 నిమిషాల్లోనే బిల్ గేట్స్ ముందు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చానని తెలిపారు. 

ఆ రోజు జరిగిన సమావేశం ఫలితంగానే మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ కు వచ్చిందని అన్నారు. ఇప్పుడదే మైక్రోసాఫ్ట్ కు మన సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్నారని గర్వంగా చెప్పారు. 

ఐటీ తర్వాత తాను ఎక్కువగా ఫార్మా రంగంపై దృష్టి సారించానని, జీనోమ్ వ్యాలీ కోసం అప్పట్లో భారీగా భూములు ఇచ్చామని వెల్లడించారు. ఇప్పుడు ఆ జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచం మొత్తానికి కొవిడ్ వ్యాక్సిన్ లు అందించామని చెప్పారు.

More Telugu News