Karnataka: ‘నందిని’ స్వీట్లతో కర్ణాటక కాంగ్రెస్ అగ్ర నేతల సంబరాలు.. బీజేపీపై సెటైర్లు!

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్
  • ప్రచారంలో కీలక అంశంగా నందిని, అమూల్ డెయిరీలు
  • నందిని బ్రాండ్ ను దెబ్బతీసేందుకు అమూల్ తెచ్చారంటూ కాంగ్రెస్ విమర్శలు
Congress takes dig at BJP with Nandini sweet Karnataka victory celebration

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. హంగ్ వస్తుందని పలు సర్వేలు తెలిపినా ఏకంగా 135 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా స్పష్టమైన మెజారిటీ సాధించింది. దాంతో, అధికారిక బీజేపీకి ఘోర ఓటమి ఎదురైంది. బీజేపీని గద్దెదింపిన కాంగ్రెస్ పార్టీ విజయ సంబరాల్లో మునిగింది. రాజ్యసభ ఎంపీ రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ జాతీయ అధినేత మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఇతర పార్టీల నేతలు ‘నందిని’ మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీపై సూర్జేవాలా సెటైర్ వేశారు. ‘నందిని లేకుండా, కర్ణాటకలో ఏదీ పూర్తి కాదు. నందిని ఇప్పుడు కన్నడిగులందరినీ మించిపోయింది’ అని రణదీప్ సూర్జేవాలా పేర్కొన్నారు. 

ఎన్నికలకు ముందు, గుజరాత్ రాష్ట్ర మిల్క్ కోఆపరేటివ్ బ్రాండ్ అయిన అమూల్ బెంగళూరులో తాజా పాలు, పెరుగును ఆన్‌లైన్‌లో డెలివరీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో విమర్శలు ఎదురయ్యాయి. ఇది ప్రచారాంశంగా కూడా మారింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ  డెయిరీ బ్రాండ్ 'నందిని' ని దెబ్బకొడుతున్నారని కాంగ్రెస నేతలు ఆరోపించారు. బీజేపీ మద్దతుతో అమూల్ ను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ద్వారా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్‌ఎఫ్) బ్రాండ్ 'నందిని'కి ముప్పు కలుగుతుందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపించాయి. నందిని బ్రాండ్ కన్నడిగుల గుర్తింపు అని, అమూల్‌తో దాన్ని దెబ్బకొడుతున్నారని ఆరోపించారు.

More Telugu News