Lingamaneni: చంద్రబాబు కరకట్ట గెస్ట్ హౌస్‌ ను అటాచ్ చేసిన ప్రభుత్వం

  • గెస్ట్ హౌస్ విషయంలో క్విడ్ ప్రొ కో జరిగిందని ఆరోపణ
  • వ్యాపారి లింగమనేనికి లబ్ది చేకూర్చేలా గత ప్రభుత్వ నిర్ణయాలు
  • నిజం ఎప్పటికీ దాగదన్న వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని
YSRCP Govt Attaches Lingamaneni Guest House in Karakatta

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ఉన్న చంద్రబాబు గెస్ట్ హౌస్ ను జగన్ ప్రభుత్వం అటాచ్ చేసింది. రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారి లింగమనేని రమేశ్ కు చెందిన ఈ ఆస్తిని క్విడ్ ప్రొ కో ద్వారా చంద్రబాబు తీసుకున్నారని ఆరోపించింది. క్రిమినల్ లా అమెండ్‌మెంట్ 1944 చట్టం ప్రకారం ఆ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలని సీఐడీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ ఏపీ సీఐడీ అధికారులు గెస్ట్ హౌస్‌ను అటాచ్ చేశారు. 

చంద్రబాబు పాలనలో లింగమనేనికి అనుకూలంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని, ప్రతిఫలంగా కరకట్టపై నిర్మించిన గెస్ట్ హౌస్ ను మాజీ సీఎం పొందారని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబుపై అభియోగాలు నమోదైన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే చట్ట ప్రకారం గెస్ట్ హౌస్ ను అటాచ్ చేసినట్లు వివరించారు. ఇదొక్కటే కాదు గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా లబ్ది పొందిన వారి ఆస్తులను అటాచ్ చేస్తామని పేర్ని నాని స్పష్టం చేశారు.

మంగళగిరి ఎమ్మెల్యే పిటిషన్ పై ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందేనని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు. వ్యాపారి లింగమనేని రమేశ్ తో పాటు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో లబ్ది పొందిన వ్యాపారుల ఆస్తులను అటాచ్ చేయాలని జగన్ సర్కారు జీవో విడుదల చేసిందన్నారు. ఈ సందర్భంగా నిజాలను కలకాలం దాచలేరని, ఎప్పటికైనా నిజం బయటపడుతుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

కరకట్టపై నిర్మించిన గెస్ట్ హౌస్ లింగమనేని రమేశ్ కు చెందినదని, ల్యాండ్ పూలింగ్ లో ఆయన ప్రభుత్వానికి అప్పజెప్పారని స్వయంగా చంద్రబాబే గతంలో చెప్పారని అన్నారు. ప్రభుత్వానికి అప్పజెప్పడం వల్లే తాను అందులో ఉంటున్నానని చంద్రబాబు మీడియా ముందు వెల్లడించారని చెప్పారు. అయితే, పూలింగ్ లో ఇచ్చినట్లు ఎక్కడా ఆధారాలు లేవని పేర్ని నాని తెలిపారు. ఈ నేపథ్యంలో లింగమనేనికి ఎలాంటి అద్దె చెల్లించకుండా సదరు గెస్ట్ హౌస్ లో చంద్రబాబు ఎలా ఉంటున్నారో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు.

More Telugu News