Prabh Simran Singh: ప్రభ్ సిమ్రన్ సెంచరీ... మిగతా వాళ్లు బ్యాట్లెత్తేశారు!

  • ఢిల్లీ క్యాపిటల్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 రన్స్ చేసిన పంజాబ్
  • 65 బంతుల్లో 103 పరుగులు చేసిన ప్రభ్ సిమ్రన్
  • చెత్తగా ఆడిన మిగతా పంజాబ్ బ్యాటర్లు
Prabh Simran Singh century helps Punjab Kings reasonable score

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. 

పంజాబ్ ఈ మాత్రం స్కోరు చేసిందంటే అందుకు కారణం ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ సెంచరీ సాధించడమే. మిగతా బ్యాటర్లందరూ విఫలమైనా, ప్రభ్ సిమ్రన్ మాత్రం దూకుడుగా ఆడి ఐపీఎల్ లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ప్రభ్ సిమ్రన్ 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. 

పంజాబ్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగా, అందులో ప్రభ్ సిమ్రన్ తర్వాత రెండంకెల స్కోరు చేసింది ఇద్దరే. శామ్ కరన్ 20, సికిందర్ రజా 11 (నాటౌట్) పరుగులు చేశారు. ఓ దశలో పంజాబ్ కింగ్స్ 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

కెప్టెన్ శిఖర్ ధావన్ (7), లియామ్ లివింగ్ స్టోన్ (4), జితేశ్ శర్మ (5) విఫలమయ్యారు. ఈ దశలో ప్రభ్ సిమ్రన్... శామ్ కరన్ తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. శామ్ కరన్ అవుటయ్యాక హర్ ప్రీత్ బ్రార్ (2), షారుఖ్ ఖాన్ (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సికిందర్ రజా ఒక సిక్స్ కొట్టి కాస్త ఫర్వాలేదనిపించాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2, అక్షర్ పటేల్ 1, ప్రవీణ్ దూబే 1, కుల్దీప్ యాదవ్ 1, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు.

More Telugu News