Karnataka: మరికాసేపట్లో కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని రెండెకరాల పందెం!

Karnataka vote count starts soon betting in high pitch
  • కర్ణాటక ఫలితాలపై జోరుగా బెట్టింగులు
  • తనతో పందెం కాయాలంటూ డప్పుకొట్టి చాటింపు వేయించిన వ్యక్తి
  • తాను చెప్పిన వ్యక్తులు గెలుస్తారంటూ కోటి రూపాయల పందానికి రెడీ అయిన మరో వ్యక్తి 
  • వైరల్ అవుతున్న వీడియోలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఈ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఓ వ్యక్తి అయితే తనకున్న రెండు ఎకరాలను పందానికి పెట్టాడు. తనతో పందెం కాసేవారు ఉంటే రావాలని డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు. 

హొన్నాళ్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య బరిలో ఉన్నారు. వీరిద్దరిపైనా జోరుగా పందాలు జరుగుతుండగా, నాగణ్ణ అనే వ్యక్తి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ గెలుస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని తాను రెండెకరాల పొలాన్ని పందెం కాస్తున్నానని, తనపై పందెం కాసేవారు ఉంటే ముందుకు రావాలంటూ గ్రామంలో గురువారం రాత్రి డప్పు కొట్టి చాటింపు వేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు, కొండసీమల చామరాజనగర జిల్లాలోనూ బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. వీటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ సోమణ్ణ గెలుస్తారంటూ కోటి రూపాయల వరకు పందాలు కాసినట్టు తెలుస్తోంది. గుండ్లుపేట తాలూకా మల్లయ్యనపుర గ్రామానికి చెందిన కిరణ్ తన చేతిలో రూ. 3 లక్షలు పట్టుకుని కాంగ్రెస్ గెలుస్తుందని పందెం కాశాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆయన నివాసంపై దాడులు చేసి విచారణ చేపట్టారు. తాను చెబుతున్న వ్యక్తులు గెలుస్తారని, కాదనుకున్న వారు కోటి రూపాయల పందెం కాయొచ్చన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Karnataka
Karnataka Assembly Polls
Congress
BJP
JDS
Shanthana Gowda
MP Renukacharya

More Telugu News