Supreme Court: బెంగాల్‌లో 'ది కేరళ స్టోరీ'ని ఎందుకు నిషేధించారు?: మమత ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న

  • బెంగాల్లో సినిమా నిషేధంపై కోర్టులో సవాల్ చేసిన నిర్మాతలు
  • ప్రజలు ఇష్టపడకుంటే సినిమాను చూడరని వ్యాఖ్యానించిన సుప్రీం బెంచ్
  • తమిళనాడులో థియేటర్ల వద్ద తీసుకున్న భద్రతా చర్యల గురించి ప్రశ్న
SC issues notice to Bengal over The Kerala Story ban

రాష్ట్రంలో 'ది కేరళ స్టోరీ'పై ఎందుకు నిషేధం విధించవలసి వచ్చిందో కారణాన్ని వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ చిత్రం ప్రదర్శింపబడుతోందని, దీని ప్రదర్శనపై నిషేధానికి కారణం కనిపించడం లేదని పేర్కొంది. బెంగాల్లో ఈ సినిమాను నిషేధించడాన్ని సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు పిటిషన్ దాఖలు చేశారు.

పశ్చిమ బెంగాల్ దేశంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా లేదని, బెంగాల్ రాష్ట్రం ఎందుకు సినిమా ప్రదర్శనకు అనుమతించడం లేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సినిమా కళాత్మక విలువలతో దీనికి సంబంధం లేదని, ప్రజలు సినిమాని ఇష్టపడకపోతే వారు సినిమాను చూడరని సుప్రీం బెంచ్... బెంగాల్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి స్పష్టం చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం మే 8న ఈ సినిమాపై నిషేధం విధించింది. 

మరోవైపు, సినిమాను ప్రదర్శించే థియేటర్లలో భద్రత కల్పించేందుకు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. థియేటర్లపై దాడులు, కుర్చీలు తగులబెడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సినిమానే తీసివేయటం సరికాదని పేర్కొంది.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌లో కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయి ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. దాంతో ఆ ట్రైలర్ నుంచి ఆ సంఖ్యను తొలగించారు. ఇది ఓ వర్గానికి వ్యతిరేకం కాదని, ఐఎస్ఐఎస్ తీవ్రవాదానికి వ్యతిరేకమని చిత్ర బృందం చెబుతోంది.

More Telugu News