Governament Contract Officer: కాంట్రాక్టు ఉద్యోగికి కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన అధికారులు.. తవ్వేకొద్దీ బయటపడుతున్న అవినీతి బాగోతం!

  • మధ్యప్రదేశ్‌ లో కాంట్రాక్టు ఉద్యోగి హేమా మీనా నివాసంలో లోకాయుక్త సోదాలు
  • ఆమె జీతం నెలకు రూ.30 వేలు.. కానీ రూ.7 కోట్ల ఆస్తులు గుర్తించిన అధికారులు
  • ఇంట్లో రూ.30 లక్షల విలువ చేసే అత్యాధునిక టీవీ
  • రూ.కోటితో విలాసవంతమైన ఇల్లు.. అందులో మొబైల్‌ జామర్లు
  • 100 కుక్కలు.. గిర్ జాతి పశువులు.. 20 లగ్జరీ కార్లు ఉన్నట్లు గుర్తింపు 
  • గురువారం నుంచి కొనసాగుతున్న సోదాలు
luxury cars land rs 30 lakh tv found in raids on madhya pradesh officer

ఆమె ఓ కాంట్రాక్టు ఉద్యోగి.. నెలకు రూ.30 వేల జీతం.. కానీ ఆమె ఆస్తులు చూసి అధికారులు షాక్‌ అయ్యారు. ఆమె లగ్జరీ లైఫ్ ను చూసి విస్తుపోయారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ లో కాంట్రాక్టు ఇన్‌చార్జ్ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్న హేమా మీనా అవినీతి బాగోతాన్ని లోకాయుక్త అధికారులు బట్టబయలు చేశారు.

భోపాల్‌ లోని హేమా మీనా నివాసంలో గురువారం ఉదయం నుంచి  లోకాయుక్త అధికారుల ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఆమె నెల జీతం కేవలం రూ.30 వేలు మాత్రమే. కానీ ఆమె వద్ద 7 లగ్జరీ కార్లు, విలువైన గిర్‌ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే అత్యాధునిక టీవీని అధికారులు గుర్తించారు.

హేమ తన తండ్రి పేరు మీద 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కొనుగోలు చేసి అందులో రూ.కోటి వెచ్చించి విలాసవంతమైన ఇంటిని నిర్మించినట్లు గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కూడా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌, మొబైల్‌ జామర్‌లు, ఇతర విలువైన వస్తువులను కూడా అధికారుల సోదాల్లో బయటపడ్డాయి.

సుమారు 20 లగ్జరీ వాహనాలను హేమా మీనా కొనుగోలు చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అందులో ట్రాక్టర్లు, వరి నాట్లు యంత్రాలు, హార్వెస్టర్లు, అనేక వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో లోకాయుక్త అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో మరిన్ని అక్రమ ఆస్తుల చిట్టా బయటపడే అవకాశం కనిపిస్తోంది. హేమపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

More Telugu News