man walks in front of elephant: ఏనుగు ముందు ఓ వ్యక్తి పిచ్చి చేష్టలు.. నెటిజన్ల ఆగ్రహం!

  • తమిళనాడులోని ధర్మపురి హోగెనెక్కల్ ఫారెస్ట్ ఏరియాలో రోడ్డుపైకి వచ్చిన ఏనుగు 
  • ఏనుగు ముందుకు వెళ్లి దండం పెడుతూ, చేతులెత్తి పోజులిచ్చిన ఓ వ్యక్తి
  • రెండు సార్లు దాడి చేయబోయి.. వెనక్కి తగ్గిన ఏనుగు.. వీడియో వైరల్
Tamil Nadu man walks in front of elephant with folded hands in viral video

అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి ఏనుగులు అప్పుడప్పుడూ తారసపడుతుంటాయి. రోడ్డుకు అడ్డుగా నిలబడి వాహనదారులపై దాడులు చేసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. అందుకే ఏనుగులు రోడ్డు దాటి, అడవి లోపలికి వెళ్లిపోయే దాకా వాహనదారులు కొద్దిదూరంలోనే బండ్లను ఆపేసి ఎదురుచూస్తుంటారు.

తమిళనాడులోని ధర్మపురిలో హోగెనెక్కల్ ఫారెస్ట్ ఏరియాలో ఓ ఏనుగు అలాగే రోడ్డుపైకి వచ్చింది. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ ఒకవైపున ఆగిపోయింది. కాలు దువ్వుతూ, ఘీంకరిస్తూ కనిపించింది. కొందరు కార్లు, బైకులను ఆపేశారు. బస్సులు మాత్రం వెళ్తున్నాయి. 

ఈ సమయంలో ఓ వ్యక్తి ఏనుగు వద్దకు వెళ్లాడు. అక్కడున్న వాళ్లు వెళ్లొద్దని అరుస్తున్నా దాని ముందుకు వెళ్లి.. దండం పెట్టాడు. తర్వాత చేతులెత్తి పోజులిచ్చాడు. ఈ సమయంలో ఏనుగు ఘీంకరిస్తూ అతడిపైకి దూసుకొచ్చినంత పని చేసింది. అయితే, క్షణంలో ఆ ఏనుగు వెనక్కి తగ్గింది. అతడు మాత్రం తాపీగా అక్కడి నుంచి వచ్చేశాడు. అతడు తాగి ఇలా చేశాడని స్థానికులు చెప్పారు 

ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు సాకేత్ బడోలా, రమేశ్ పాండే షేర్ చేశారు. “ఇలాంటి చికాకు కలిగించే మూర్ఖులను తట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే ఆ ఏనుగులను అంతలా గౌరవించేది” అని బడోలా రాసుకొచ్చారు. “ఇది ఆత్మహత్యాసదృశ్యమే. అప్పుడు కూడా ఆ ఏనుగు ఈ మనిషిని సహించింది. అతన్ని విడిచిపెట్టింది’’ అని రమేశ్ పాండే క్యాప్షన్ ఇచ్చారు. 

ఇక నెటిజన్లు ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘అతడు అదృష్టవంతుడు.. ఏనుగు రెండు సార్లు హెచ్చరించి వదిలేసింది’’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఇంత పిచ్చిగా ఎలా ఉంటారు?’ అని ఇంకొకరు.. ‘అసలు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు’ అని మరొకరు రాసుకొచ్చారు.

More Telugu News