Vishnu Vardhan Reddy: బీజేపీ నేతలను కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తిస్తారా?: విష్ణువర్ధన్ రెడ్డి

  • నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు వచ్చిన సీఎం జగన్
  • చుక్కల భూముల సమస్యల పరిష్కార కార్యక్రమం ప్రారంభం
  • నిరసనలు తెలిపేందుకు యత్నించిన బీజేపీ నేతలు
  • పోలీసులు బీజేపీ నేతలపై దాడి చేశారన్న విష్ణువర్ధన్ రెడ్డి
Vishnu Vardhan Reddy fires on police

ఏపీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. కావలిలో నిర్వహించిన సభలో చుక్కల భూముల సమస్యలను పరిష్కరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

కాగా, సీఎం జగన్ కావలి పర్యటన నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య నిరసనలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు జీవో నెం.1ని కొట్టివేసి క్షణాలు గడవకముందే ఏపీ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రికి ప్రజాసామ్యయుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని పదుల సంఖ్యలో పోలీసులు బీజేపీ నేతలపై దాడి చేస్తారా? కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తిస్తారా? అని నిలదీశారు. 

పోలీసులతో కలిసి విపక్షాలను అణచివేసిన ప్రభుత్వాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయని, వైసీపీ పాలనకు కూడా అదే గతి పట్టనుందని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News