East Godavari District: ప్రియుడు దక్కలేదన్న అక్కసు.. అర్ధరాత్రి వెళ్లి కత్తిపీటతో నరికి చంపిన యువతి!

Young Girl killed boy friend for not giving money back
  • తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఘటన
  • ప్రేమించిన వ్యక్తికి మరొకరితో పెళ్లి
  • అవసరాల నిమిత్తం ఇచ్చిన రూ. 2 లక్షల నగదు, బంగారు గొలుసు తిరిగి ఇచ్చేయాలన్న నిందితురాలు
  • ఫలితం లేకపోవడంతో స్నేహితుడితో కలిసి ప్రియుడిని చంపేయాలని ప్లాన్
ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదన్న కోపంతో ఓ యువతి అతడిని విచక్షణ రహితంగా నరికి చంపింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు (25) తాపీ మేస్త్రి.  అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెలకవీధికి చెందిన కుర్లు డిబేరా అనే యువతితో రాజమండ్రిలో చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉంది. ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో నాగశేషు అవసరాల నిమిత్తం డిబేరా రూ. 2 లక్షల నగదు, బంగారు గొలుసు ఇచ్చింది. 

మరోవైపు, కుమారుడి ప్రేమ వ్యవహారం గురించి తెలిసిన నాగశేషు కుటుంబ సభ్యులు ఏడాది క్రితం మరో యువతితో వివాహం జరిపించారు. విషయం తెలిసిన డిబేరా తనకు ఇవ్వాల్సిన డబ్బులు, గొలుసు తిరిగి ఇచ్చేయాలని నాగశేషును కోరింది. ఫలితం లేకపోవడంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. తన స్నేహితుడైన శివన్నారాయణకు విషయం చెప్పి సాయం కోరింది.

బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో శివన్నారాయణతో కలిసి బైక్‌పై నాగశేషు ఇంటికి వెళ్లింది. డాబాపై నిద్రిస్తున్న అతడిని లేపి డబ్బులు ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది మరింత ముదరడంతో వెంట తెచ్చుకున్న కత్తి పీటతో నాగశేషుపై దాడిచేసింది. ఈ గొడవకు పైకి వచ్చిన నాగశేషు తల్లి గంగ అడ్డుకోవడానికి ప్రయత్నించగా శివన్నారాయణ ఆమెపై కర్రతో దాడిచేశాడు.

కత్తిపీట దాడిలో తీవ్రంగా గాయపడిన నాగశేషును స్థానికులు గోకవరం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మరింత మెరుగైన చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
East Godavari District
Gokavaram
Crime News

More Telugu News