Uddhav Thackeray: నాది నైతిక రాజీనామా... ఇప్పుడు షిండే, ఫడ్నవీస్ రాజీనామా చేయాలి: ఉద్దవ్ థాకరే

  • నాటి గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టిందని గుర్తు చేసిన మాజీ సీఎం
  • చట్టవిరుద్ధం, అనైతికమే బీజేపీ మార్గమంటూ ఆదిత్య థాకరే ట్వీట్
  • సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించేందుకు శరద్ పవార్ నో
I resigned on moral ground says Uddhav Thackeray

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి సుప్రీం కోర్టు ప్రకటనపై ఉద్దవ్ థాకరే స్పందించారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే థాకరే తనంతట తానుగా రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై ఉద్ధవ్ స్పందిస్తూ... తాను నైతికతతో రాజీనామా చేశానని స్పష్టం చేశారు. నాడు గవర్నర్ నిర్ణయం కూడా తప్పు అని అదే సుప్రీం కోర్టు తెలిపిందని, కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నాడు నైతిక బాధ్యతగా తాను ఎలా అయితే రాజీనామా చేశానో ఈ రోజు షిండే కూడా అలాగే చేయాలన్నారు. షిండే వర్గం పార్టీకి, తన తండ్రికి వెన్నుపోటు పొడిచిందన్నారు. చట్టపరంగా తన రాజీనామా తప్పు కావొచ్చు, కానీ నైతికంగా తాను చేసింది సరైనదే అన్నారు.

రాజ్యాంగ విరుద్ధం... చట్టవిరుద్ధం... అనైతికం... అదొక్కటే మార్గం - బీజేపీ గద్దర్ సర్కార్. ముఖ్యంగా ఈ రోజు సుప్రీం కోర్టు వ్యాఖ్యల తర్వాత అది మరోసారి వెల్లడైందని ఆదిత్య థాకరే ట్వీట్ చేశారు. మరోవైపు, సుప్రీం కోర్టు తీర్పుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించేందుకు నిరాకరించారు. 

నాటి మహారాష్ట్ర గవర్నర్‌పై సుప్రీం కోర్టు చెప్పిన అంశంపై తానేమీ మాట్లాడనని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు. కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన వ్యవహరించారని మాత్రం చెప్పగలనని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ జరిగి, అందులో తమ ప్రభుత్వం విఫలమైతే ఏమిటని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రశ్నించారు.

More Telugu News