Dhoni: అది నా బాధ్యత.. కాకపోతే నన్ను ఎక్కువ పరుగెత్తనివ్వకండని ముందే చెప్పాను..: ధోనీ

  • జట్టు కోసం పరుగులు చేసినందుకు సంతోషంగా ఉందన్న ధోనీ
  • ఐపీఎల్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటోందని వ్యాఖ్య
  • రుతురాజ్ గైక్వాడ్ లాంటి వ్యక్తులు అరుదుగా దొరుకుతారని ప్రశంస
dont make me run a lot ms dhonis instruction to csk teammates gives this reason

ఐపీఎల్ లో 200 పరుగులు కొట్టినా.. డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. భారీ టార్గెట్లను కూడా ఉఫ్ మని ఊదేస్తున్నారు. కానీ ఢిల్లీతో మ్యాచ్ లో 167 పరుగులే కొట్టినా.. తన కెప్టెన్సీతో సీఎస్కేను గెలిపించాడు మహేంద్ర సింగ్ ధోనీ. అంతకుముందు ఇన్నింగ్స్ చివర్లో వచ్చి ధనాధన్ ఇన్సింగ్స్ తో విలువైన పరుగులనూ అందించాడు. మ్యాచ్ అనంతరం పలు ఆసక్తికర విషయాలను ధోనీ పంచుకున్నాడు. 

తన ఆటతీరుపై సంతోషం వ్యక్తం చేసిన ధోనీ.. ఇలా ఆడేందుకు నెట్స్‌లో చాలా కష్టపడ్డానని తెలిపాడు. ‘‘చివర్లో వచ్చి జట్టుకు కావాల్సిన పరుగులు చేయడం నా బాధ్యత. నన్ను ఎక్కువ పరుగెత్తనివ్వకండని జట్టుకు ముందే తెలియజేశా. నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. జట్టు కోసం నేను ఇలానే ఆడాలనుకున్నాను. జట్టు కోసం పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని వివరించాడు.

‘‘మేం టోర్నమెంట్ చివరి దశకు దగ్గరగా ఉన్నాం. నేను మిచ్ శాంట్నర్ ని ఇష్టపడతాను. అతను ఫ్లాట్ వికెట్ల‌పై కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. సీమ్‌ని కొట్టి, మంచి పేస్‌తో బౌలింగ్ చేస్తాడు. రుతురాజ్ గైక్వాడ్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పరుగులు చేయడం మొదలుపెడితే అతను చాలా ఈజీగా ఆడుతాడు. పరిస్థితులకు తగ్గట్లు తన ఆటను మార్చుకుంటాడు. అతడి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతారు. గేమ్ ను చదివే వ్యక్తులు జట్టులో ఉండటం అవసరం’’ అని చెప్పాడు. 

‘‘సెకండాఫ్‌లో పిచ్‌పై మరింత టర్న్ లభించింది. వికెట్ నెమ్మదిస్తుందని మేం భావించాం. వాస్తవానికి ఈ వికెట్‌పై మంచి స్కోర్ ఏంటో మాకు తెలియదు. అందుకే మా బౌలర్లకు అత్యుత్తమ బంతులు వేయాలని చెప్పాను. ప్రతీ బంతిని వికెట్ కోసం ప్రయత్నించవద్దని తెలిపాను’’ అని ధోనీ వివరించాడు.

నిన్నటి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ధోనీ, శివమ్ దూబే, అంబటి రాయుడు రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లు ఆడి 8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసింది.

More Telugu News