Andhra Pradesh: కేదార్ నాథ్ లో తప్పిపోయిన ఏపీ మహిళ.. ఆదుకున్న గూగుల్ ట్రాన్స్ లేటర్

68 year old woman from Andhra Pradesh separated from family in Kedarnath reunites using Google Translate
  • గౌరీకుండ్ లో ఒంటరిగా కనిపించిన ఏపీ మహిళ
  • తెలుగు తప్ప మరో భాష రాకపోవడంతో ఎదురైన ఇబ్బంది
  • గూగుల్ ట్రాన్స్ లేటర్ ద్వారా ఫోన్ నంబర్ అర్థం చేసుకున్న పోలీసులు
తీర్థయాత్రల కోసం కుటుంబంతో కలసి వచ్చిన 68 ఏళ్ల మహిళ కేదార్ నాథ్ లో తప్పిపోయింది. ఆంధప్రదేశ్ కు చెందిన సదరు మహిళ గూగుల్ ట్రాన్స్ లేటర్ ద్వారా పోలీసులు చేసిన కృషితో చివరికి తన కుటుంబాన్ని చేరుకోగలిగింది. పీటీఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆమె పేరు వెల్లడించలేదు. 

కుటుంబంతో కలసి కేదార్ నాథ్ దర్శనానికి వచ్చి, తిరిగి వెళుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా, కుటుంబం నుంచి ఆమె వేరుపడింది. గౌరీకుండ్ లో ఒంటరిగా, కంగారుగా సంచరిస్తున్న ఆమెను పోలీసులు ప్రశ్నించారు. తెలుగు తప్ప మరో భాష రాకపోవడంతో ఇబ్బంది ఎదురైంది. ఏది అడిగినా తెలుగులోనే ఆమె చెబుతోంది తప్పించి, ఇంగ్లిష్ లేదా హిందీలో మాట్లాడలేకపోతోంది.

ఆమె సైగలను బట్టి కుటుంబం నుంచి విడిపోయినట్టు తెలిసిందని సబ్ ఇన్ స్పెక్టర్ రమేచ్ చంద్ర బెల్వాల్ తెలిపారు. దీంతో పోలీసులు గూగుల్ ట్రాన్స్ లేటర్ సాయం తీసుకున్నారు. ఆమె చెబుతున్నది ట్రాన్స్ లేటర్ సాయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆమె తెలుగులో చెప్పిన నంబర్ ను ట్రాన్స్ లేటర్ లో టైప్ చేసి అప్పుడు ఆ నంబర్ కు కాల్ చేయగా, సోన్ ప్రయాగ్ లో కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుసుకున్నారు. గౌరీకుండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో సోన్ ప్రయాగ్ ఉంటుంది. దీంతో ఓ వాహనంలో ఆమెను సోన్ ప్రయాగ్ పంపించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
Andhra Pradesh
old woman
separated
family
lost contact
google translator

More Telugu News