Pawan Kalyan: నాతో సమస్యలు చెప్పుకున్న రైతులపై వేధింపులకు దిగితే.. తీవ్ర పరిణామాలే: వైసీపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ హెచ్చరికలు

  • రైతులు తమ సమస్యలను జనసేనకు చెప్పుకున్నారని కక్ష కట్టవద్దన్న పవన్ 
  • సకాలంలో పంట కొనకపోవడం వల్లే ధాన్యం తడిసిందని విమర్శ
  • అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ 
  • ప్రతి రైతుకు న్యాయం జరిగే దాకా జనసేన పోరాడుతుందని వెల్లడి
jana sena chief pawan kalyan demands to resolve farmers issues

తనకు సమస్యలు చెప్పుకున్న రైతులపై అధికారులు గానీ, మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ దుశ్చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇటీవలి అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం పరిశీలించారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో గురువారం రాజమహేంద్రవరంలో ఆయన ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.

రైతులు తమ సమస్యలను జనసేనకు చెప్పుకున్నారని కక్ష కట్టవద్దని పవన్ కోరారు. డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన చేస్తే కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అన్నం పెట్టిన రైతును వేధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

‘‘ఏపీలో ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుంది. వారికి సరైన పరిహారం వచ్చే దాకా పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.  

‘‘సకాలంలో ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే అకాల వర్షాలకు ధాన్యం తడిసింది. వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తాత్సారం చేశారు. సీఎం క్షేత్రస్థాయిలో వాస్తవ నివేదికలు పరిశీలించలేదు’’ అని పవన్ విమర్శించారు. 

‘‘మేం పర్యటన చేస్తున్నామని తెలిసి అధికారులు హడావుడిగా గోనెసంచులు ఏర్పాటు చేశారు. ఒత్తిడి చేస్తే తప్ప పట్టించుకోవడం లేదు. ఎవరో వస్తారు.. తిరుగుబాటు చేస్తారు అనిపిస్తే తప్ప పట్టించుకునే నాథుడు లేడు’’ అని మండిపడ్డారు. 

‘‘మాకు రుణమాఫీ అవసరం లేదు. ప్రతి పంటకు పావలా వడ్డీకి పాతికవేలు రుణం ఇప్పించండి చాలు. మేం ఎవ్వరి మీదా ఆధారపడం. మేం ఎవరికైనా ఇంత పెట్టేవాళ్లం తప్ప.. అకారణంగా తీసుకునే వాళ్లం కాదు’’ అని రైతులు కోరుతున్నారని వివరించారు. 

‘‘వినతి పత్రం ఇద్దామని రైతులు వస్తే.. అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. రైతులకు వైసీపీ చేస్తున్న అన్యాయమిది. నా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకున్న రైతులపై ప్రభుత్వ అధికారులు గానీ, మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి దుశ్చర్యలకు దిగినా, దాడులకు దిగినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతుల సమస్యలు తెలుసుకోండి. పరిష్కరించండి. అంతే తప్ప సమస్యలు చెప్పుకున్న వాళ్లపై కేసులు పెట్టి హింసిస్తే సహించేది లేదు. సమస్య మరింత తీవ్రమవుతుంది’’ అని హెచ్చరించారు.

More Telugu News