JC Prabhakar Reddy: నాపై 78 కేసులు పెట్టారు.. మళ్లీ జన్మ ఎత్తితే తప్ప అవి పూర్తి కావు: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • కేసులకు, జైళ్లకు భయపడేది లేదన్న ప్రభాకర్ రెడ్డి
  • రాజు తలుచుకుంటే కేసులకు కొదవా అని ప్రశ్న
  • ఏ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చానో కూడా తెలియదని వ్యాఖ్య
  • రేపు ఐఏఎస్, ఐపీఎస్‌ల పిల్లలపై ఇలానే కేసులు పెడితే ఎలా ఉంటుందని ఆగ్రహం
tdp leader jc prabhakar reddy at vijayawada court

తనపై 78 కేసులు పెట్టారని, మళ్లీ జన్మ ఎత్తితే తప్ప ఈ కేసులు పూర్తికావని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేసులకు, జైళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చారు. 

ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజు మారాడు.. కేసులు పెట్టారు. రాజు తలుచుకుంటే కేసులకు కొదవా? దగ్గర దగ్గర నాపై 78 కేసులున్నాయి. ఏ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చానో కూడా తెలియదు. విచారణను జూన్ 26కు వాయిదా వేశారు. ఇవి ఇప్పుడే అయిపోవు. మళ్లీ జన్మ ఎత్తితే తప్ప ఈ కేసులు పూర్తికావు’’ అని చెప్పుకొచ్చారు. 

‘‘కేసులకు భయపడే వాడు లేడు. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేం కూడా ఇలానే అనుకుంటే ఏమవుతుంది? ఇది పద్ధతి కాదు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, ఇలా కేసులు పెట్టడం సరికాదు. మేం పవర్ లోకి వస్తే కేసులు పెట్టబోం. క్షమించేస్తాం’’ అని చెప్పారు. 

రాజకీయంగా ప్రతీకారాలు ఉండకూడదనేదే తన అభిమతమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేసులు పెట్టుకుంటూ పోతే అందరూ కోర్టులలోనే ఉంటారన్నారు. ఇప్పుడు పవర్ లో ఉండేవాళ్లందరూ 24 గంటలూ కోర్టుల్లోనే ఉంటారని చెప్పారు. ‘‘రేపు ఐఏఎస్, ఐపీఎస్‌లు అందరూ బాధపడతారు.. వాళ్లకు పిల్లలు ఉంటారు. వాళ్లపై ఇలానే కేసులు పెడితే ఎలా ఉంటుంది?’’ అని ప్రశ్నించారు.

More Telugu News