Indian Army: జెట్ ప్యాక్ తో గాల్లో విహరిస్తూ సరిహద్దుల్లో జవాన్ల కాపలా

  • గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం
  • ఎనిమిది నిమిషాల వరకు ప్రయాణించొచ్చు
  • త్వరలోనే జమ్మూ కశ్మీర్లో జవాన్లకు సరఫరా
  • సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాల బలోపేతంపై దృష్టి
Indian Army Jet Pack Suits Could Debut In Kashmir soldiers

దేశ సరిహద్దుల్లో నేలపై బీఎస్ఎఫ్ జవాన్లు, ఆర్మీ జవాన్లు, ఐటీబీపీఎఫ్ జవాన్లు అనుక్షణం కాపలా కాస్తుంటారు. అయినప్పటికీ, శత్రుదేశం నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. పొరుగు దేశం వైపు నక్కి ఉన్న ఉగ్రవాదుల జాడ అన్ని సందర్భాల్లో కెమెరాలు పసిగట్టలేకపోవచ్చు. 

అలాంటి సమయంలో పొరుగు దేశంలోని సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులు, సైనికుల కార్యకలాపాలను గమనించేందుకు, అవసరమైతే ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేసేందుకు ఓ సాధనం అందుబాటులోకి రాబోతోంది. సైనికులే గాల్లోకి ఎగిరి లక్ష్యాలను గుర్తించేందుకు వీలుగా జెట్ ప్యాక్ సూట్లను ఆర్మీ కొనుగోలు చేయనుంది. దేశ సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో వీటిని సమకూర్చుకుంటోంది. వచ్చే కొన్ని నెలల్లోనే ఇవి దేశ సైనికులకు అందనున్నాయి. వీటికి సంబంధించిన టెండర్ ను ఈ ఏడాది జనవరిలోనే విడుదల చేయడం గమనార్హం. 

ఆగ్రాలోని ఆర్మీ ఎయిర్ బోర్న్ ట్రెయినింగ్ స్కూల్ లో గ్రావిటీ ఇండస్ట్రీస్ అనే బ్రిటిష్ కంపెనీ జెట్ ప్యాక్ సూట్లపై ఆర్మీ అధికారులకు ఇటీవలే ప్రదర్శన ఇచ్చింది. రోడ్డు, పొలాలు, నదులపైనా ఈ జెట్ సూట్ తో వెళ్లిపోవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. 80 కిలోల వరకు బరువున్న వ్యక్తి దీన్ని ధరించి, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాల్లో ఎగిరి వెళ్లిపోవచ్చు. అలా ఎనిమిది నిమిషాల పాటు జెట్ స్యూట్ ప్రయాణించగలదు. ఇందులోని ఇంజన్ ద్రవ ఇంధనంతో నడుస్తుంది. వీటిని త్వరలోనే జమ్మూ కశ్మీర్లో జనాన్లకు అందించనున్నారు.

More Telugu News