Finland: విడాకులు తీసుకోనున్న ఫిన్‌లాండ్ డైనమిక్ మహిళా ప్రధాని

  • అతి పిన్న వయసులో ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించిన సనా మారిన్
  • 2019లో ప్రధానిగా ఎన్నికయ్యాక మార్కస్‌తో వివాహం
  • వ్యక్తిగత వీడియో వైరల్ కావడంతో విమర్శలపాలు
  • ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి
  • ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న సనా మారిన్
Finland PM Announces Divorce With Husband

అతి పిన్న వయసులోనే ఫిన్‌లాండ్ దేశ పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించిన డైనమిక్ ప్రధాని సనా మారిన్ (37) త్వరలో విడాకులు తీసుకోనున్నారు. భర్త మార్కస్‌ రైకోనెన్‌తో తన మూడేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఆమె భర్త కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆ దంపతులకు అయిదేళ్ల వయసున్న కుమార్తె ఉంది. 

‘‘మేం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. మేం 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పటికీ మేం మంచి స్నేహితులమే. మా కూతురికి తల్లిదండ్రులమే. ఆమె కోసం ఓ కుటుంబంగా ఎప్పటికీ సమయాన్ని కేటాయిస్తాం’’ అని సనా మారిన్ ఓ పోస్ట్ పెట్టారు. 

సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త అయిన మార్కస్ రైకోనెస్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కూడా! కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన వీరు మూడేళ్ల క్రితం సనా ప్రధాని అయ్యాక పెళ్లి చేసుకున్నారు. 

కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వాన్ని ముందుండి నడిపించిన సనా పాప్యులారిటీ ఆకాశాన్ని తాకింది. క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడని నేతగా ఆమె ప్రజల మన్ననలు పొందారు. ఆ తరువాత సనా తన అధికారిక నివాసంలో జరిగిన ఓ పార్టీలో పాల్గొనగా తీసిన వీడియో వైరల్ కావడంతో ఆమె ప్రతిష్ఠ మసకబారింది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు అధర చుంబనాలకు దిగడం వైరల్ అయ్యింది. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంటే ఇలాంటి పార్టీలు చేసుకుంటారా అంటూ విమర్శకులు ఆమెపై విరుచుకుపడ్డారు. 

అయితే ప్రధానిగా తన బాధ్యతలు ఎన్నడూ మరువలేదని సనా మారిన్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కార్యాలయానికి ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదని గుర్తు చేశారు. తాను మనిషినే అని, కాస్తంత సంతోషంగా గడిపితే తప్పా అంటూ ఓ సమావేశంలో కన్నీటిపర్యంతమయ్యారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో సనా నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమి చవిచూసింది. తదుపరి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేవారకూ ఆమె ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

More Telugu News