Mudragada Padmanabham: త్వరలో రాజకీయ నిర్ణయం ప్రకటిస్తాను: ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన

Mudragada letter to andhra pradesh people
  • తుని రైలు దగ్ధం కేసును రైల్వే కోర్టు కొట్టివేయడంపై హర్షం
  • ఉద్యమాలే ఊపిరిగా పని చేశానని, డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదని వ్యాఖ్య
  • రాజకీయ నాయకుల నుండి సారా, డబ్బును కోరుకోవద్దని హితవు
కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గం నేతలను ఉద్దేశించి బుధవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. అదే సమయంలో తుని రైలు దగ్ధం కేసును రైల్వే కోర్టు కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైలు దగ్ధం సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, తీహార్ జైలుకు వెళ్లాలని లేదా అండర్ గ్రౌండ్ కు వెళ్లాలని అప్పుడు తనకు సూచన చేశారని, కానీ అలా చేస్తే కులంతో పాటు ఉద్యమం చులకన అవుతుందని భావించినట్లు చెప్పారు. నాటి డీజీపీకి కూడా రైలు దగ్ధం కేసును తన పైనే పెట్టాలని, సభకు వచ్చిన వారిని బాధ్యులుగా చేయవద్దని కోరినట్లు చెప్పారు. ఈ కేసును వాదించేందుకు పలువురు లాయర్లు ముందుకు వచ్చారని గుర్తు చేసుకున్నారు.

తన తాత, తండ్రి నడిచిన దారిలోనే తాను నడుస్తున్నానని, జాతిని తాకట్టు పెట్టలేదని, ఉద్యమాలే ఊపిరిగా పని చేశానని ఆ లేఖలో పేర్కొన్నారు. తాను జీవితంలో కోర్టుకు వెళ్లలేదని, తుని ఘటన తర్వాత ప్రతి వాయిదాకు కోర్టుకు వెళ్లానని, తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి జరిగిందేదో జరిగిపోయిందనీ, ఇందుకు తాను ఎవరినీ నిందించడం లేదన్నారు. తుని ఘటన కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటే అలా నడుచుకుందామని భావించానని, ఉరిశిక్ష వేసినా అప్పీల్ కు వెళ్లవద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఈ కేసులో తన గురించి నేను ఎప్పుడూ బాధపడలేదని, కానీ తనతో పాటు 30 మంది సామాన్యుల గురించి ఆందోళన చెందినట్లు చెప్పారు. వీరంతా తన పిలుపుతో ఉద్యమంలోకి వచ్చారని, కాబట్టి వారి బాధ్యత తనదే అన్నారు. తనకు ఎలాంటి పదవీ కాంక్ష లేదన్నారు. జాతి కోసం పదవులు త్యాగం చేశానని చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశానన్నారు. 1984లో ఎన్టీఆర్.. మంత్రి పదవి ఇస్తానంటే స్వీకరించలేదన్నారు.

తనకు ఉద్యమాలలో, రాజకీయాలలో డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేదన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు పాడు చేయాలని చెప్పలేదని తెలిపారు. తాను త్వరలో రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఆ మార్పు వస్తేనే రాజకీయాలలో ఉన్నవారు తప్పకుండా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సాధారణ ప్రజలు రాజకీయ నాయకుల నుండి సారా, డబ్బును కోరుకోవద్దని హితవు పలికారు. నిస్వార్థంగా సేవ చేసే వారికి మద్దతివ్వాలన్నారు. అప్పుడు అభ్యర్థులు తప్పు చేయరని, దీంతో వారి ఖర్చు లక్షల్లో మాత్రమే ఉంటుందన్నారు. అదే జరిగితే ఏ నాయకుడు కూడా తప్పు చేయడని చెప్పారు. ఆ దిశగా ప్రజలు, విద్యావంతులు, మేధావులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైల్వే కోర్టు తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించారని అభిప్రాయపడ్డారు.
Mudragada Padmanabham
Andhra Pradesh

More Telugu News