Revanth Reddy: కంటోన్మెంట్ ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోవడం నియమ నిబంధనలకు విరుద్ధం: రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

  • కంటోన్మెంట్ ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం దొంగిలిస్తోందని కాంగ్రెస్ చీఫ్ ఆరోపణ
  • కంటోన్మెంట్‌కు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • నంది ఎల్లయ్య, సాయన్న విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచన
Revanth Reddy comments on Contonment revenue

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం దొంగిలిస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ బోర్డు సమావేశంలో వివిధ అంశాలపై చర్చించినట్లు చెప్పారు. 

కంటోన్మెంట్ ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోవడం నియమ నిబంధనలకు విరుద్ధమని రేవంత్ అన్నారు. కంటోన్మెంట్ కు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో విడుదల చేయడం లేదన్నారు. అందువల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. కంటోన్మెంట్ కు రావాల్సిన ఆదాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి కూడా కేంద్రం నుండి రావాల్సిన నిధులను విడుదలయ్యేలా చొరవ చూపాలన్నారు.

కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులపై బోర్డు సమావేశంలో చర్చించినట్లు రేవంత్ పేర్కొన్నారు. రోడ్లు, నాలాలు, సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చలు జరిపినట్లు చెప్పారు. అలాగే మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే సాయన్న విగ్రహాలను కంటోన్మెంట్ పరిధిలో ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు. అందుకు స్థలాన్ని పరిశీలించనున్నట్లు బోర్డు తెలిపిందన్నారు.

More Telugu News