Karnataka: కర్ణాటక ఎన్నికలు.. ఇప్పటి వరకు ఓటేసిన రాజకీయ, సినీ ప్రముఖులు వీరే

Politicians and Celebrities Cast their vote in Karnataka elections
  • ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ప్రముఖులు
  • ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు ప్రకాశ్ రాజ్, గణేశ్, నటి అమూల్య
  • ముందుగా పూజలు చేసిన సీఎం బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప
ఈ ఉదయం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో ఉన్న 2,165 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని  5.31 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. 

ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. సిద్దగంగ మఠానికి చెందిన సిద్దలింగ స్వామి తుముకూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు శిఖారీపూర్‌లోని శ్రీ హుచ్చరాయ స్వామి ఆలయంలో కుటుంబంతో కలిసి పూజలు చేశారు. 

ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ బెంగళూరులో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ నేత నిర్మలా సీతారామన్ బెంగళూరులో ఓటు వేశారు. కన్నడ నటి అమూల్య, ఆమె భర్త బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు గణేశ్ భార్యతో కలిసి ఆర్ఆర్ నగర్‌లో ఓటు వేశారు. 

కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి తీర్థహళ్లిలో ఓటు వేశారు. మరో మంత్రి కె. సుధాకర్ చిక్కబళ్లాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో మంత్రి, కనకపుర బీజేపీ అభ్యర్థి ఆర్.అశోకా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు. షిగావ్ నుంచి బరిలో ఉన్న బొమ్మై ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు హుబ్బళిలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. 

యడియూరప్ప మాట్లాడుతూ.. షికారిపుర నుంచి తొలిసారి బరిలోకి దిగిన విజయేంద్ర 40 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఓటు వేసిన అనంతరం చెప్పారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తితో కలిసి ఉదయాన్నే బెంగళూరులోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలో నిల్చుని ఓటేశారు. 

ఈ సందర్భంగా సుధామూర్తి మాట్లాడుతూ.. తాము ఈ వయసులో ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నామని, తమ నుంచి నేర్చుకుని యువత కూడా ముందుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Karnataka
Prakash Raj
Actress Amulya
Yediyurappa
Basavaraj Bommai
BJP
Congress
JDS

More Telugu News