Arjun Tendulkar: మళ్లీ మొదటికి వచ్చిన సచిన్ తనయుడి పరిస్థితి!

  • 2021 నుంచి ఐపీఎల్ లో చాన్సు కోసం ఎదురుచూస్తున్న అర్జున్
  • తొలిసారి ఈ సీజన్ లో ఆడే అవకాశం
  • ముంబయి ఇండియన్స్ కు 4 మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం
  • అర్జున్ టెండూల్కర్ ప్రతిభపై పెదవి విరుస్తున్న విమర్శకులు
  • సచిన్ తనయుడ్ని పక్కనబెడుతున్న ముంబయి ఇండియన్స్
Arjun Tendulkar IPL career with just four matches

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ ఏడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన తొలి మ్యాచ్ ఆడేందుకు అర్జున్ టెండూల్కర్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాడు. 

2021 నుంచి ముంబయి ఇండియన్స్ జట్టుతోనే ఉన్నప్పటికీ, ఈ ఏడాది అతడి కల నెరవేరింది. ఈ సీజన్ లో అర్జున్ టెండూల్కర్ ముంబయి ఇండియన్స్ తరఫున 4 మ్యాచ్ లు ఆడాడు. మొత్తమ్మీద 3 వికెట్లు తీసిన సచిన్ తనయుడు విమర్శకులను మెప్పించలేకపోయాడు. అతడి బౌలింగ్ లో పేస్ లేకపోవడం, కొన్నిసార్లు ఫీల్డింగ్ కు తగినట్టుగా బంతులు వేయలేకపోవడం ప్రతికూలంగా మారింది. 

టోర్నీ మొదట్లో కాబట్టి అర్జున్ కు కొన్ని అవకాశాలు ఇచ్చిన ముంబయి ఇండియన్స్ మేనేజ్ మెంట్... ఇప్పుడా సాహసం చేయలేకపోతోంది. టోర్నీలో ప్లే ఆఫ్ దశకు చేరాలంటే ప్రతి మ్యాచ్ లోనూ తప్పక గెలవాల్సిన స్థితిలో అర్జున్ టెండూల్కర్ ను ఆడించడం అంటే రిస్క్ తీసుకోవడమేనని భావిస్తోంది. ఈసారి ఐపీఎల్ లో ఒకట్రెండు జట్లు మినహా మిగిలిన అన్ని జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ ట్రెండ్ లో అర్జున్ టెండూల్కర్ ముంబయి ఇండియన్స్ తరఫున మరో మ్యాచ్ ఆడడం కష్టమేననిపిస్తోంది. ఈ కుర్రాడు ఐపీఎల్ లో మళ్లీ ఎప్పుడు మ్యాచ్ ఆడతాడన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. 

ఏదేమైనా సచిన్ వారసుడి వయసు 23 ఏళ్లే కాబట్టి, ఐపీఎల్ లో మరెన్నో మ్యాచ్ లు ఆడే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లతో తన ఆటతీరును సమీక్షించుకుని, బౌలింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకుంటే అర్జున్ టెండూల్కర్ కెరీర్ కు దోహదపడుతుంది.

More Telugu News