Zero Shadow day: హైదరాబాద్ లో నీడ పోయింది.. రెండు నిమిషాలు జీరో షాడో!

  • మధ్యాహ్నం 12:12 నుంచి 12:14 దాకా జీరో షాడో
  • ఎండలో నిటారుగా ఉంచిన ఏ వస్తువు నీడా కనిపించలేదు
  • ఆగస్టు 3న కూడా హైదరాబాద్‌లో ‘జీరో షాడో డే’
zero hadow day in hyderabad for two minutes

హైదరాబాద్ లో ఈ రోజు అద్భుతం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ మాయమైంది. ‘జీరో షాడో’ ఏర్పడింది. ఆ సమయంలో ఎండలో నిటారుగా (90 డిగ్రీల కోణంలో) ఉంచిన ఏ వస్తువు నీడా రెండు నిమిషాల పాటు కనిపించలేదు.

12:12 గంటల నుంచి 12:14 వరకు ఈ అద్భుతం కనిపించింది. అరుదైన సంఘటనను చూసి నగరవాసులు ప్రత్యేక అనుభూతి చెందారు. బిర్లా టెంపుల్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో శాస్త్రవేత్తలు జీరో షాడో డే సందర్భంగా ఈ ఖగోళ అద్భుతంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

నిట్టనిలువుగా సూర్య కిరణాలు పడటంతో నీడ మాయమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి సంవత్సరంలో రెండుసార్లు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు. హైదరాబాద్ ప్రజలు మరోసారి ఇలాంటి అద్భుతాన్ని చూసే అవకాశం ఉందని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో ఆగస్టు 3వ తేదీన కూడా ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని బిర్లా సైన్స్‌ సెంటర్‌ అధికారులు తెలిపారు. ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 గంటల సమయంలో రెండు నిమిషాల పాటు ఎండలో నిటారుగా ఉన్న వస్తువుల నీడ మాయమైంది.

More Telugu News