Sharad Pawar: నాయకత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో మాకు తెలుసు: ఉద్ధవ్ శివసేనకు శరద్ పవార్ కౌంటర్

  • ఎన్సీపీ ఇటీవలి పరిణామాల పట్ల సామ్నా పత్రికలో విమర్శలు
  • వారసుడి ఎంపికలో పవార్ విఫలమయ్యారని వ్యాఖ్య
  • ఎవరో ఏదో రాస్తే పట్టించుకోమని, మా పార్టీ గురించి మాకు తెలుసు అన్న పవార్
NCP knows how new leadership is created Pawar on Shiv Sena jibe

ఎన్సీపీలో జరుగుతున్న పరిణామాలపై ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన విమర్శలు గుప్పించింది. దీనికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. వారసుడిని తయారు చేయడంలో పవార్ విఫలమయ్యారని ఉద్ధవ్ వర్గం వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు అధికారిక పత్రిక సామ్నాలో సోమవారం ఓ ఎడిటోరియల్ ను రాసింది. పార్టీ వారసుడి ఎంపికలో పవార్ విఫలమయ్యాడని, ఆయన రాజీనామా తర్వాత ఏర్పాటైన జంబో కమిటీలో బీజేపీతో కలిసి వెళ్లాలనుకునే నాయకులు సభ్యులుగా ఉన్నారని పేర్కొంది. కానీ ఎన్సీపీ కేడర్ నుండి ఒత్తిడి కారణంగా ఆ కమిటీ తిరిగి పవార్ కే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

సామ్నా సంపాదకీయంపై పవార్ తీవ్రంగా స్పందించారు. అలాంటి వ్యాఖ్యలను తాము పట్టించుకోమని, పార్టీని ఎలా నడపాలో తమకు తెలుసునని చెప్పారు. తమ పార్టీ నాయకత్వం గురించి ఎవరో ఏదో రాస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాయడం వారి హక్కు అని, దానిని విస్మరించడం తమ పని అన్నారు. తమ పార్టీ పని తీరుపై తాము సంతృప్తిగా ఉన్నామని, పార్టీని ఎలా నడపాలో, నాయకత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో తమకు తెలుసునని చెప్పారు.

రాజకీయ పార్టీల మధ్య అన్ని విషయాల్లో నూరు శాతం పొంతన ఎప్పుడూ ఉండదని, కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇవి మహా వికాస్ అఘాడీ పైన ప్రభావం చూపవని చెప్పారు.

More Telugu News