Mangoes: ఒక్కో మామిడి పండు రూ.19,000 రూపాయలు.. ప్రపంచంలో ఖరీదైన రకాలు ఎన్నో

  • హకుగిన్ నో టాయో రకానికి డిమాండ్
  • మనదేశంలోనూ మధ్యప్రదేశ్ లో మియాజాకి మామిడి సాగు
  • థాయిల్యాండ్ గోల్డెన్ పిల్లో పండు 500 డాలర్లు
Worlds Most Expensive Mangoes cultivation

మన దగ్గర రూ.25-30 పెడితే మామిడి పండు లభిస్తుంది. కానీ, జపాన్ లోని హొక్కాయిదో దీవిలో హిరోయుకి నకగవ (62) పండించే మామిడి పండు ఒక్కటి కొనుక్కోవాలన్నా రూ.19,000 చెల్లించుకోవాలి. అక్కడ చెట్లపై పండిన వాటిని జాగ్రత్తగా తెంపి వాటిని మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తారు. గ్రీన్ హౌస్ మధ్యలో, ఎప్పుడూ కూడా 36 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య మామిడి సాగు అవుతుంటుంది. తాను చేపట్టిన ఈ ప్రత్యేక మామిడి సాగు ఏదో ఒక రోజు తనకు కాసుల వర్షం కురిపిస్తుందని నకగవ కూడా ఎప్పుడూ ఊహించలేదు. ప్రపంచంలో నేడు ఖరీదైన మామిడి రకాల్లో ఇది కూడా ఒకటి. ఒక్కో పండు డిమాండ్ ఆధారంగా కొన్ని సందర్భాల్లో 300 డాలర్లు (రూ.25వేలు) కూడా పలుకుతుంది. 

అంతకుముందు ఆయిల్ కంపెనీని నకగవ నడిపించేవారు. ధరలు పెరిగిపోవడంతో శిలాజ ఇంధనాలకు బయట ప్రత్యామ్నాయ వ్యాపారం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. మియాజాకి ప్రాంతంలో మరో రైతు సూచనతో నకగవ మామిడి సాగులోకి వచ్చారు. నోరావర్క్స్, జపాన్ పేరుతో కంపెనీని ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత తాను పండించే మామిడిని ‘హకుగిన్ నో టాయో’ పేరుతో ట్రేడ్ మార్క్ తీసుకున్నారు. దీనర్థం మంచులో సూర్యుడని. 

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఖరీదైన మామిడి రకాలను పండిస్తున్నారు. జపాన్ నుంచి తెచ్చిన మియాజాకి మ్యాంగోని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో సాగు చేస్తున్నారు. ఈ రకం మామిడి పండ్లు కిలో రూ.20,000కు విక్రయిస్తున్నారు. జపాన్ తో పాటు థాయిల్యాండ్, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్ లోనూ కొన్ని రకాలు సాగు చేస్తున్నారు. 

థాయిల్యాండ్ లో మా డక్ టాంగ్ లేదా గోల్డెన్ పిల్లో అనే మామిడి రకం ఒక్కో పండు 500 డాలర్లు పలుకుతుంది. వినూత్నమైన ఆకారం, భిన్నమైన రుచి ఉంటుంది. ఫిలిప్పీన్స్ లో కరబావో అనేది ఖరీదైన మామిడి రకం. మన దేశంలోని మహారాష్ట్రలో పండించే ఆల్ఫాన్సో రకం మామిడి పండ్లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటోంది. ప్రత్యేకమైన రుచి కలిగిన ఈ పండ్లు కిలో రూ.400కు పైన పలుకుతాయి. ఇక పాకిస్థాన్ లో సింధూరి ఖరీదైన రకంగా చెప్పుకోవచ్చు. ఈ పండ్లు అక్కడి నుంచి యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్ కు ఎగుమతి అవుతున్నాయి.

More Telugu News