Nara Lokesh: చంద్రబాబు, వైఎస్ మధ్య వాదనలు జరిగితే ఆయనే సంధానకర్త: లోకేశ్

  • కర్నూలులో లోకేశ్ పాదయాత్ర
  • సంఘీభావం తెలిపిన న్యాయవాదులు
  • ఆర్యవైశ్యులతో లోకేశ్ ముఖాముఖి
  • రోశయ్యను గుర్తుచేసుకున్న లోకేశ్
  • రోశయ్య కాంగ్రెస్ అయినా ఆయనంటే తమకు గౌరవం అని వెల్లడి
Lokesh remembers senior leader Rosaiah

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు నగరంలో హోరెత్తింది. యువనేత పాదయాత్రతో నగరంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయి, జనసంద్రంగా మారాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని పాదయాత్ర సందర్భంగా లోకేశ్ హామీ ఇచ్చారు. 

జిల్లా కోర్టు భవనం ముందు న్యాయవాదులు లోకేశ్ ను కలిసి సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... కర్నూలుకు కేటాయించిన జ్యుడీషియల్ అకాడమీని జగన్ తరలించారని, హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారని విమర్శించారు. 

అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీం కోర్టులో వైసీపీ ప్రభుత్వం తెలిపిందని వెల్లడించారు. విశాఖలో హైకోర్టు అని మంత్రి బుగ్గన చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ మాయ మాటలు విని మోసపోయామని న్యాయవాదులు లోకేశ్ తో పేర్కొన్నారు. జగన్ లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ తమది కాదని, కర్నూలులో  హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. 

కాగా న్యాయవాదుల్లో ఓ వర్గం లోకేశ్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలపగా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.

జ‌గ‌న్ రిపేరు రెడ్డీ... ఈ బ్రిడ్జి నువ్వు క‌ట్టావా...?

కర్నూలు శివారు జోహార్ పురం వద్ద హంద్రీనీవా నదిపై గత ప్రభుత్వంలో నిర్మించిన బ్రిడ్జి వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు. "టీడీపీ ప‌థ‌కాల‌కి పేర్లు మార్చాడు. చంద్రబాబు గారు చేసిన శంకుస్థాప‌న‌ల‌కే మ‌ళ్లీ శిలాఫ‌ల‌కాలు వేసి డ‌బ్బా కొట్టుకుంటూ జ‌గ‌న్ రిపేరు రెడ్డి అయ్యాడు. 

నాలుగేళ్ల పాల‌న‌లో ఒక్క అభివృద్ధి పని‌ చేయ‌డం చేత‌కాని జ‌గ‌న్ రిపేరు రెడ్డి... కర్నూలు ఓల్డ్ సిటీ -జొహారాపురం మధ్య హంద్రీ నదిపై టీడీపీ నిర్మించిన వారధిని మాత్రం తాను నిర్మించాన‌ని డ‌ప్పు కొట్టుకుంటున్నాడు. టీడీపీ స‌ర్కారు 90 శాతం బ్రిడ్జి ప‌నులు పూర్తి చేస్తే, 10 శాతం ప‌నులు పూర్తి చేసి ఆరంభించ‌డానికి జ‌గ‌న్ రిపేరు రెడ్డికి నాలుగేళ్లు ప‌ట్టింది. 

బ్రిడ్జికి ఆ చివ‌ర‌, ఈ చివ‌ర మ‌ట్టి క‌ప్పలేని జ‌గ‌న్ రిపేరు రెడ్డి మూడు రాజ‌ధానులు క‌డ‌తాడ‌ట‌! భోగాపురంలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు నిర్మించేసి డబుల్ డెక్కర్ విమానాలు దింపుతాడ‌ట‌" అంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

లోకేశ్ కు కృత‌జ్ఞత‌లు 

టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో ప్రయోజ‌నం పొందిన వారు, పాద‌యాత్రగా త‌మ ప్రాంతానికి వ‌చ్చిన లోకేశ్ ని క‌లిసి టీడీపీ చేసిన మేలు మ‌ర‌వ‌లేమ‌ని చెబుతున్నారు. విదేశీ విద్య ప‌థ‌కం కింద సాయం అందుకుని జ‌ర్మనీలో చ‌దువుకున్న త‌న‌యుడు అక్కడే ఉన్నతోద్యోగంలో సెటిల‌య్యాడ‌ని, తమ కుటుంబం సంతోషంగా ఉండ‌టానికి తెలుగుదేశం ప్రభుత్వమే కార‌ణ‌మ‌ని బాల‌గంగాధ‌ర్ తిల‌క్ అనే వ్యక్తి పేర్కొన్నారు. లోకేశ్ కి స్వీట్లు అంద‌జేసి థ్యాంక్స్ చెప్పారు. 

పాప‌కి వైద్యచికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 ల‌క్షలు మంజూరు చేసిన చంద్రబాబు త‌న కంటిదీపాన్ని కాపాడార‌ని ఓ త‌ల్లి లోకేశ్ ని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసింది.

ఆర్యవైశ్యులతో లోకేశ్ ముఖాముఖి 

టీడీపీ అధికారంలోకి వచ్చాక పన్నుల విధానాన్ని ప్రక్షాళన చేసి, వ్యాపారులకు ఉపశమనం కలిగిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. బోర్డు ట్యాక్స్, చెత్తపన్ను వంటివాటితో వ్యాపారులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా నిలచేది టీడీపీ మాత్రమేనని పేర్కొన్నారు. కర్నూలులోని శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోశయ్యకు ప్రతి పుట్టినరోజుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాడినని గుర్తుచేసుకున్నారు. "రాజకీయాలకు అతీతంగా రోశయ్య పని చేశారు. రోశయ్య చనిపోయినప్పుడు సీఎం జగన్ వెళ్లలేదు. రోశయ్య కాంగ్రెస్ అయినా మాకు ఆయనంటే గౌరవం. రోశయ్యకు తగిన గౌరవం కల్పిస్తాం. మ్యూజియం ఏర్పాటు చేసి, ఆయన సేవల తాలూకా ఆనవాళ్లు మ్యూజియంలో ఏర్పాటు చేస్తాం. 

చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మధ్య పెద్ద వాదనలు జరిగినప్పుడు రోశయ్య సంధానకర్తగా ఉండేవారు. రోశయ్య సీఎం అయ్యాక చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించారు. రోశయ్య చనిపోవడంతో ఆర్యవైశ్యుల్లో పెద్దదిక్కు లేకుండా పోయింది. 

ఆర్యవైశ్యుల్లో పేదరికం ఉందని చెప్పగానే చంద్రబాబు రూ.30 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం మారాక కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. టీడీపీ వచ్చాక దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేస్తాం. పేదరికానికి కులం, మతం ఉండదు" అని లోకేశ్ స్పష్టం చేశారు.

 వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులూ బాధితులే!

కొన్ని కులాలతో పాటు ఆర్యవైశ్యులకు వైసీపీ పాలనలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ కులాల పట్ల వైసీపీకి ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవాలి. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎవర్ని కదిలించినా బాధితులుగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయా...? కానీ వైశ్యులపై ఈ ప్రభుత్వంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. 

ఆర్యవైశ్యులకు రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చాం

ఆర్యవైశ్యులను రాజ్యసభకు పంపింది టీడీపీనే. శిద్ధా రాఘవరావుకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చాం. 2014 నుండి 2019 వరకు మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. 

తప్పకుండా వైశ్యులను రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేసింది టీడీపీనే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూట్రల్ గా ఉన్నవాటిల్లోకి రాజకీయాలు తెచ్చారు.

దివ్యాంగుడిని కలిసిన లోకేశ్

కర్నూలు 17వ వార్డులోని శివాలయం వీధి నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఓ దివ్యాంగుడి ఇంటిలోకి వెళ్లిన లోకేశ్ అతని కష్టాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా దివ్యాంగుడు నరేష్ గౌడ్ తల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... 35 సంవత్సరాలుగా వచ్చే పెన్షన్ ను వైసీపీ పభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే అన్యాయంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రి రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న మరో కుమారుడి ఉద్యోగాన్ని కూడా తీసేశారని వాపోయారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... అధికారంలోకి వచ్చాక 6 లక్షల పెన్షన్లు తొలగించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు దివ్యాంగుల సంక్షేమానికి రూ.6,500 కోట్లు ఖర్చుచేశామని వెల్లడించారు. "టీడీపీ అధికారంలోకి రాగానే నరేశ్ గౌడ్ కు పెన్షన్ అందజేస్తాం. మరో ఏడాది ఓపిక పట్టండి... చంద్రన్న ప్రభుత్వం మీ అందరికీ అండగా నిలుస్తుంది" అని హామీ ఇచ్చారు.

====

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన దూరం – 1178.5 కి.మీ.*

ఈరోజు నడిచిన దూరం 8.8 కి.మీ.

*94వ రోజు (9-5-2023) యువగళం వివరాలు:*

*కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం (కర్నూలు జిల్లా)*

సాయంత్రం

3.00 – కర్నూలు పుల్లయ్య కాలేజి గ్రౌండ్స్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

3.05 – వెంకయ్యపల్లి మెయిన్ రోడ్డు వద్ద స్థానికులతో సమావేశం.

3.35 – యల్లమ్మ దేవాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.

3.40 – వెంకయ్యపల్లి శివార్లలో ఎస్సీలతో సమావేశం.

3.50 – రాంభూపాల్ నగర్ గ్రామస్తులతో సమావేశం.

4.00 – మిలటరీ కాలనీలో ఈడిగలతో సమావేశం.

4.20 – మిలటరీ కాలనీ శివార్లలో స్థానికులతో సమావేశం.

4.55 – మిలటరీకాలనీ శివార్లలో పడిదంపాడు గ్రామస్థులతో సమావేశం.

5.45 – గార్గేయపురంలో స్థానికులతో మాటామంతీ.

6.10 – గార్గేయపురం దేవాలయం రోడ్డులో స్థానికులతో సమావేశం.

6.25 – రైస్ మిల్లు రోడ్డులో మైనారిటీలతో సమావేశం.

7.15 – హంద్రీకాల్వ వద్ద తాండ్రపాడు గ్రామస్థులతో సమావేశం.

7.40 – గార్గేయపురం శివారు విడిది కేంద్రంలో బస.

*******

More Telugu News