Zinc: రుచి తెలియాలంటే.. ‘జింక్’ కావాల్సిందే..!

  • శరీరంలో ఎన్నో ముఖ్యమైన పనులకు జింక్ మినరల్ అవసరం
  • జింక్ లోపిస్తే రోగ నిరోధక వ్యవస్థ బలహీనం
  • జుట్టు రాలిపోయే సమస్య
  • ఆహారం రూపంలో రోజూ అందేలా చూసుకోవాలి
Zinc is an important nutrient but get it from food not supplements experts say

రుచి ఉంటేనే ఆహారం సహిస్తుంది. ఐస్ క్రీమ్ అయినా, కూర అయినా మరొకటి అయినా చప్పగా ఉంటే తినరు కదా?. కరోనా సమయంలో రుచి కోల్పోవడం ఎంతో మందికి అనుభవం.  మరి రుచి మనకు తెలిసేలా చేసే ఖనిజం జింక్? మన శరీంలో 100కు పైగా చర్యలకు ఇది అవసరం. 

జింక్ వల్ల ఉపయోగాలు..
ఇది తప్పనిసరి ఖనిజం. మన శరీరంలోని అన్ని కణాల్లోనూ ఉంటుంది. మన శరీరం సొంతంగా దీన్ని తయారు చేసుకోలేదు. ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా అందేలా చూసుకోవాల్సిందే. ‘‘మన జీవక్రియలు, జీర్ణప్రక్రియ, నరాల పనితీరుకు సంబంధించి 300 కు పైగా ఎంజైమ్ ల చర్యలకు జింక్ కావాలి’’ అని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ డైరెక్టర్ ఉమా నాయుడు వివరించారు. 

రోగ నిరోధక వ్యవస్థ చక్కగా పనిచేసేందుకు, చర్మం, శిరోజాలు, గోళ్ల ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు జింక్ కావాలి. డీఎన్ఏ నిర్మాణంలో, కణాల వృద్ధి, దెబ్బతిన్న కణజాలం మరమ్మత్తు చేయడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణ జలుబు నివారణకు, ఉపశమనానికి జింక్ ఎంతో సాయపడుతుంది. పిల్లల్లో నీళ్ల విరేచనాలను కట్టడి (డయేరియా) చేయడంలో మంచి ఫలితాన్నిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మాక్యులర్ డీజనరేషన్ ను నివారిస్తుంది. రుచి ఉద్దీపనలను వ్యాప్తి చేస్తుంది. అందుకే జింక్ లోపం ఉన్న వారికి అంతగా రుచులు తెలియవు. 

జింక్ లోపానికి నిదర్శనాలు
రుచి అంతగా తెలియడం లేదంటే జింక్ లోపంగానే భావించొచ్చు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. జుట్టు రాలిపోతుంటుంది. కళ్ల సమస్యలు వస్తాయి. జింక్ లోపిస్తే డిప్రెషన్ కు సైతం దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

రోజువారీ తీసుకోవాలా?
జింక్ లోపిస్తే ఎన్నో నష్టాలు వాటిల్లినట్టే.. జింక్ మోతాదు ఎక్కువైనప్పుడు కొన్ని అనర్థాలు వస్తాయి. జింక్ మోతాదు ఎక్కువైతే కాపర్, ఐరన్ ను మన శరీరం ఎక్కువ తీసుకునేలా చేస్తుంది. దాంతో హాని కలుగుతుంది. పురుషుల్లో పెద్దవారు రోజువారీ 11 మిల్లీ గ్రాములు మించకుండా జింక్ తీసుకోవచ్చు. స్త్రీలు 8 మిల్లీ గ్రాములు తీసుకోవచ్చు. గర్భిణులకు ఈ మోతాదు ఇంకా ఎక్కువ అవసరం. దాన్ని వైద్యులు సూచిస్తారు. సప్లిమెంట్ల కంటే ఆహారం రూపంలో జింక్ తీసుకునేలా చూసుకోవాలి. ముఖ్యంగా షెల్ చేపలు, కోడి గుడ్లు, చికెన్, పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు, ఓట్స్, గుమ్మడి గింజల్లో జింక్ ఉంటుంది.

More Telugu News