Pawan Kalyan: అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించాలి: పవన్ కల్యాణ్

  • నేడు అల్లూరి వర్ధంతి
  • అల్లూరి మరణించి నేటికి వందేళ్లయిందన్న పవన్
  • వీరులకు పుట్టుకే కానీ గిట్టుక ఉండదని వెల్లడి
  • దేశవాసులందరికీ అల్లూరి గురించి తెలియాలని ఆకాంక్ష 
Pawan Kalyan say govt should announce Bharata Ratna for Alluri Sitharamaraju

నాడు భరతమాత దాస్యశృంఖలాలను తెంచడం కోసం తెల్లదొరలను ఎదురొడ్డి ప్రాణత్యాగం చేసిన మన్యం వీరుడు... అల్లూరి సీతారామరాజు. ఇవాళ ఆయన వర్థంతి. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. 

వీరులకు పుట్టుకే కానీ గిట్టుక ఉండదని, వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందని తెలిపారు. వారు రగిల్చిన విప్లవాగ్ని ఎప్పటికీ ఆరిపోదని పేర్కొన్నారు. అటువంటి ధీరుడే మన అల్లూరి సీతారామరాజు అని వెల్లడించారు. 

ఆ మహా యోధుడు వీరమరణం పొంది నేటికి వందేళ్లు అని పవన్ పేర్కొన్నారు. నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ, మృత్యువుకు భయపడని నైజం, జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలని అభిప్రాయపడ్డారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలని పవన్ కల్యాణ్ కోరారు.

ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఆయన స్ఫూర్తిని దేశమంతటా చాటాలని విజ్ఞప్తి చేశారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను తామే స్వీకరిస్తామని పవన్ స్పష్టం చేశారు. ఆ తేజోమూర్తి వర్ధంతి సందర్భంగా తన పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నానని తెలిపారు.

More Telugu News