Kishan Reddy: ఒకేసారి 30 ఏళ్లకు ఎందుకు లీజుకు ఇచ్చారు?: ఓఆర్ఆర్ టోల్ లీజు అంశంపై కిషన్ రెడ్డి

Kishan Reddy questions Telangana govt over ORR toll lease issue
  • ఓఆర్ఆర్ టోల్ లీజులో అక్రమాలు జరిగాయంటున్న కిషన్ రెడ్డి
  • టోల్ లీజును ఐఆర్ బీ సంస్థకు అప్పనంగా ఇచ్చేశారని విమర్శలు
  • ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ ఎవరికో మేలు చేస్తున్నారని ఆగ్రహం
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టోల్ లీజు టెండర్లలో గోల్ మాల్ జరిగిందని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తమ పార్టీ నేతలతో గొంతు కలిపారు. ఓఆర్ఆర్ టోల్ లీజులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 30 ఏళ్ల కాలానికి ఐఆర్ బీ సంస్థ చెల్లించేది కేవలం రూ.7,380 కోట్లేనని తెలిపారు. 

ఓఆర్ఆర్ టోల్ వసూలుతో ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ.415 కోట్లు వస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. టోల్ రుసుం ఏటా 5 శాతం పెరిగితే రూ.30 వేల కోట్లు వస్తాయని... టోల్ రుసుం ఏటా 10 శాతం పెరిగితే రూ.75 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ లో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతుందని, తద్వారా టోల్ ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని అన్నారు. 

పూణే-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేను పదేళ్ల కాలానికే రూ.8,875 కోట్లకు లీజుకు ఇచ్చారని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో చాలా హైవేలను 10-15 ఏళ్లకే లీజుకు ఇచ్చారని వివరించారు. అలాంటప్పుడు ఆదాయం కోల్పోతూ ఒకేసారి 30 ఏళ్లకు ఎందుకు లీజుకు ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎవరికో మేలు చేస్తున్నారని మండిపడ్డారు.
Kishan Reddy
ORR
Hyderabad
Toll Lease
BJP
BRS
Telangana

More Telugu News