Team India: వన్డే వరల్డ్​ కప్​ కోసం భారత్ వచ్చేందుకు షరతు పెట్టిన పాకిస్థాన్​

  • 2025లో పాక్ లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటామని రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరిన పీసీబీ
  • ఆసియా కప్ లో భారత్ మ్యాచ్ లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు అంగీకారం
  • మొత్తం టోర్నీని యూఏఈలో జరపాలంటున్న బీసీసీఐ
Pakistan Will Only Come To India For WC If BCCI Gives Written Guarantee on 2025 CT Participation

ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ విషయంలో భారత్, పాకిస్థాన్ దేశాల క్రికెట్ బోర్డుల మధ్య కొంతకాలంగా మాటల దాడి నడుస్తోంది. సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ ఆతిథ్యం హక్కులు పాకిస్థాన్ దక్కించుకోగా.. అక్టోబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్ కోసం పాక్ వెళ్లేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ కోసం పాకిస్థాన్‌ జట్టును ఇండియా పంపే విషయంలో బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఓ షరతు పెట్టింది. 2025లో తమ దేశంలో జరిగే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా పాల్గొంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా రాత పూర్వకంగా హామీ ఇవ్వాలని పీసీబీ చైర్మన్‌ నజామ్‌ సేథి అంటున్నారు. అప్పుడే తమ జట్టును ఇండియా పంపిస్తామని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు పాక్‌ ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచ్‌లను యూఈఏలో ఆడించాలన్న ‘హైబ్రిడ్‌ మోడల్‌’కు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు అయిన జై షా ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ టోర్నీ మొత్తాన్ని తటస్థ వేదికపైనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌తో పాటు 2023 వన్డే వరల్డ్‌ కప్‌ విషయంలో సేథి ఏసీసీ, ఐసీసీ అధికారులపై ఒత్తిడి తేవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఆదివారం దుబాయ్ వెళ్తున్నారని సమాచారం. పాకిస్థాన్‌లో ఆసియా కప్‌ మ్యాచ్‌లు లేకుంటే ఆ టోర్నీలో పాక్‌ జట్టు ఆడబోదని వారికి స్పష్టం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో 2025 చాంపియన్స్ ట్రోఫీకి అయినా టీమిండియా పాక్ కు వస్తుందని హామీ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారని చెప్పాయి.

More Telugu News