IPL: స్పిన్నర్ 152 కి.మీ వేగంతో బంతి వేశాడా? నిజమేనా?

  • నిన్న సీఎస్కే, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన
  • తీక్షణ 152 కి.మీ. వేగంతో బంతి వేసినట్టు చూపెట్టిన వైనం
  • స్పీడో మీటర్ తప్పిదంపై సోషల్ మీడియాలో జోక్స్
 Did Maheesh Theekshana Bowl 152 Kmph

చెపాక్ స్టేడియంలో నిన్న సాయంత్రం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే స్పిన్నర్‌ మహేశ్‌ తీక్షణ గంటకు 152 కిలో మీటర్ల వేగంతో బంతిని వేసినట్టు తెరపై కనిపించింది. ఇది చూసి క్రికెట్‌ పండితులు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ముంబై ఇన్నింగ్స్‌ సందర్భంగా తీక్షణ 14వ ఓవర్లో మూడో బంతిని వదేరా లాంగాన్‌లోకి నెట్టి రెండు పరుగులు తీశాడు. ఆ బంతి వేగం 152 కి.మీ అని టీవీ స్ర్కీన్లపై కనిపించింది. క్రికెట్‌ చరిత్రలో ఓ స్పిన్నర్‌ నమోదు చేసిన అత్యంత వేగవంతమైన బంతి ఇదే అన్న చర్చ మొదలైంది. అయితే, తీక్షణ బౌలింగ్ చూస్తే మాత్రం ఆ బంతిలో అంత వేగం కనిపించలేదు.

అంత వేగంతో బౌలింగ్ చేసే పేసర్లు కూడా ఇద్దరు ముగ్గురే ఉన్నారు. దాంతో, స్పీడో మీటర్ తప్పిదం వల్లనే 152 కి.మీ స్పీడు అని నమోదైందని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన మిమ్స్, జోక్స్ నడుస్తున్నాయి. గతంలో కూడా స్పీడో మీటర్ బంతి వేగాన్ని తప్పుగా చూపెట్టిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంతో నిన్నటి మ్యాచ్ లో ఉపయోగించిన స్పీడో మీటర్ ను నాప్తాల్ వెబ్ సైట్ లో కొన్నారని, అది పాకిస్థాన్‌ మీటర్‌ కావొచ్చని నెటిజన్స్ జోక్స్ పేలుస్తున్నారు. స్పీడో మీటర్ మందు తాగినట్టుందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

More Telugu News