Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: శశిథరూర్

Shashi Tharoor calls for Presidents rule in violence hit Manipur
  • మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న శశిథరూర్
  • బీజేపీని ఎన్నుకున్న ఓటర్లు తాము మోసపోయినట్టు భావిస్తున్నారని వ్యాఖ్య
  • ప్రభుత్వం వాగ్దానం చేసిన గొప్ప పాలన ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వెల్లడి
గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ఆయన అధికార బీజేపీని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఏడాది క్రితం బీజేపీకి అధికారం కట్టబెట్టిన ఓటర్లు తాము దారుణంగా మోసపోయామని ప్రస్తుతం భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

మే 3న రాష్ట్రంలో గిరిజనులైన కుకీలు, గిరిజనేతరులైన మేతీల మధ్య హింసాత్మక ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆయుధాలు చేతబూనిన మూకలు గ్రామాల్లో దాడులకు తెగబడ్డాయి. ఇళ్లకు నిప్పు పెట్టి, షాపులను లూటీ చేశాయి. దీంతో, అల్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతాల్లో  నిషేధాజ్ఞలు జారీ చేసింది. 

మణిపూర్‌లో ఘర్షణలు ఇంకా చల్లారకపోవడంపై శశిథరూర్ తాజాగా ట్వీట్ చేశారు. ‘‘అక్కడ హింస ఇంకా ప్రజ్వరిల్లుతుండటంతో చాలా మంది భారతీయులు ఆలోచనలో పడ్డారు. గొప్ప పాలన అందిస్తామన్న ప్రభుత్వ వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఏడాది క్రితం బీజేపీకి అధికారం ఇచ్చిన మణిపూర్ ఓటర్లు తాము దారుణంగా మోసపోయామని ఇప్పుడు భావిస్తున్నారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించడంలో విఫలమైంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.
Manipur
Shashi Tharoor

More Telugu News