Narendra Modi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే పోటీ చేస్తున్నారు!: ప్రధాని మోదీ

  • బెంగళూరులో మోదీ 25 కిలో మీటర్ల రోడ్ షో, ఇసుక వేస్తే రాలనంత జనం
  • గతంలో చూడని ప్రేమ, అప్యాయతను కర్ణాటక ప్రజలు పంచారన్న ప్రధాని
  • డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి అని వ్యాఖ్య
  • మాజీ సీఎం గత స్థానం వదిలి పారిపోయారన్న మోదీ
People Are Fighting Karnataka Assembly Election On Behalf Of BJP PM Modi

బెంగళూరులో రోడ్‌షో సందర్భంగా తనకు లభించిన అపూర్వ స్పందన చూశాక కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేది ప్రజలేనన్న నమ్మకం కలిగిందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. బెంగుళూరులో తాను గతంలో ఎన్నడూ చూడని ప్రేమ, ఆప్యాయత చూశానని, ఇది అసమానమైనదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు రోడ్డు షో ముగిసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ రోజు ఉదయం నేను ప్రజా దేవుళ్లను చూసేందుకు వెళ్లానని, అక్కడ ప్రజలు తనపై ఎంతో ప్రేమ, ఆప్యాయత కనబరిచారన్నారు.

బెంగుళూరు రోడ్‌షో సందర్భంగా మోదీ కాన్వాయ్ వెళ్ళిన 25 కిలోమీటర్ల పొడవునా ప్రజలు రోడ్లపై నిలబడి చూశారు. ఈ రోడ్డు షో సాగిన మేర ప్రజలు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారని మోదీ అన్నారు. రోడ్డుకు ఇరువైపులా నిలుచొని కుటుంబ సభ్యులతో సహా స్వాగతం పలికారన్నారు. బెంగళూరులో ప్రస్తుత పరిస్థితిని చూసిన తర్వాత ఇక్కడ మోదీ పోటీ చేయడం లేదని, బీజేపీ నేతలు కూడా బరిలో లేరని, ప్రజలే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే నమ్మకం కలిగిందన్నారు.

బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వివక్ష లేకుండా అభివృద్ధి కోసం పని చేస్తోందన్నారు. తొలిసారి బాగల్‌కోట్ ప్రజలు మూడు లక్షల ట్యాప్డ్ వాటర్ కనెక్షన్‌లు పొందారని, బాగల్‌కోట్‌కు చెందిన 25,000 మందికి పైగా వారి స్వంత సిమెంట్ ఇల్లు పొందారని, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలు బాగల్‌కోట్ ప్రజలకు చేరాయన్నారు.

2018 ఎన్నికల్లో జిల్లాలోని బాదామి నియోజకవర్గం నుంచి ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. గత మూడున్నరేళ్లలో ఏ అభివృద్ధి జరిగినా తన ప్రభుత్వ హయాంలోనే జరిగిందని సిద్ధరామయ్య చెబుతున్నట్లు విన్నానని, అభివృద్ధి చేసిన వారు ఎవరైనా ఉంటే అది తమ బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానిదే అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన కృషి వల్లే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ తమ పార్టీ పరిపాలిస్తున్నందున హైవేలు మెరుగుపడుతున్నాయని, రైల్వే ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని మోదీ అన్నారు.

కాంగ్రెస్ మాజీ సీఎం గతంలో పోటీ  చేసిన నియోజకవర్గాన్ని వదిలి పెట్టి వరుణ స్థానానికి వెళ్లిపోయారని, ఇక్కడ గాలి ఏ దిక్కుకు వీస్తుందో ఆయన పసిగట్టారన్నారు. అతను కనుక ఇక్కడకు వస్తే మౌలిక సదుపాయాలు, ఆయన చేసిన అభివృద్ధి గురించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి 85 శాతం కమీషన్‌ ట్రాక్‌ రికార్డు ఉందని ఆరోపించారు. తాము ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్ వల్లే దేశం ఇన్ని దశాబ్దాలుగా వెనుకబడి పోయిందన్నారు.

బీజేపీ కాంగ్రెస్ పాత అలవాట్లను పూర్తిగా తప్పించి, ఆధార్, మొబైల్ ఫోన్, జన్-ధన్ ఖాతాల త్రిశూలాన్ని ఉపయోగించిందన్నారు. తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి రూ.29 లక్షల కోట్లను బదిలీ చేసి పైసా కూడా దోచుకోకుండా ప్రజలకు చేర్చిందన్నారు మోదీ. కాంగ్రెస్ నేతలు అయితే అందులో రూ.29 లక్షల కోట్లు దోచుకునే వారని విమర్శించారు. 

అతి పెద్ద మొబైల్ ఫోన్ల‌ను త‌యారీ చేసే దేశాల్లో భారత్ కూడా ఒక‌టిగా మారిందన్నారు. ఒకప్పుడు మన దేశంలో కేవలం రెండు సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు దేశంలో 200 కంటే ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు. 2014కు ముందు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక జీబీ మొబైల్ ఇంటర్నెట్ డేటా రూ.300 ఉండేదని, బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఇప్పుడు ఒక జీబీ డేటా రూ.10 మాత్రమే ఉందని చెప్పారు. అప్పుడు నెలకు రూ.4వేల నుండి రూ.5వేల వరకు ఖర్చయ్యేదన్నారు.

More Telugu News