Ukraine: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆఫీసుపై డ్రోన్ సంచారం, కూల్చేసిన సైన్యం.. వీడియో ఇదిగో!

  • గాలిలోనే పేల్చేసిన ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్
  • రష్యా డ్రోన్ అంటూ తొలుత ప్రకటించిన సెక్యూరిటీ చీఫ్
  • ఆపై డ్రోన్ తమదేనని, అదుపు తప్పడంతో కూల్చేశామని వివరణ
Video Shows The Moment Ukraine Shot Down Own Drone Over Kyiv

రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఇటీవల డ్రోన్ దాడి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందేనని రష్యా అధికారులు ఆరోపించగా.. తమకు సంబంధంలేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వివరించారు. తాజాగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఓ డ్రోన్ కలకలం రేపింది. ప్రెసిడెంట్ జెలెన్ స్కీ కార్యాలయంపైన డ్రోన్ ఎగరడంతో సైన్యం అప్రమత్తమైంది. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఆ డ్రోన్ ను కూల్చేశారు. జెలెన్ స్కీ ఆఫీసుకు దగ్గర్లో ఉండగా గాలిలోనే డ్రోన్ ను పేల్చేశారు.

తమ శత్రువులే ఈ డ్రోన్ ను ప్రయోగించారని ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంద్రేయ్ యెర్మాక్ ఆరోపించారు. డ్రోన్ ను గాలిలో ఉండగానే కూల్చేశామని ప్రకటించారు. ఆ తర్వాత కూల్చేసిన ఆ డ్రోన్ తమదేనని యెర్మాక్ వివరించారు. సైన్యానికి చెందిన ఆ డ్రోన్.. రొటీన్ చెకప్ లో భాగంగా గాల్లోకి ఎగిరిందని చెప్పారు. అయితే, కాసేపటికి అదుపుతప్పడంతో ముందుజాగ్రత్త చర్యగా దానిని కూల్చేసినట్లు పేర్కొన్నారు. కీవ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాల్లో ఎగురుతున్న డ్రోన్ ను గుర్తించిన సైన్యం.. అది అధ్యక్షుడి ఆఫీసుకు దగ్గర్లోకి వస్తుండగా మిసైల్ తో కూల్చేసింది. డ్రోన్ ను తాకిన మిసైల్ గాలిలోనే పేలిపోవడం వీడియోలో కనిపించింది.

More Telugu News