Galla Jayadev: 270 ఎకరాల్లో గల్లా జయదేవ్ అమరరాజా గిగా ఫ్యాక్టరీ.. శంకుస్థాపన చేసిన కేటీఆర్

KTR in land breaking ceremony of Galla Jayadev Amara Raja giga factory
  • మహబూబ్ నగర్ జిల్లాలో రూ. 9,500 కోట్ల పెట్టుబడితో అమరరాజా ఫ్యాక్టరీ
  • తెలంగాణలో ఇదే తొలి గిగా ఫ్యాక్టరీ
  • మిత్రుడు గల్లా జయదేవ్ కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. మొత్తం 270 ఎకరాల్లో నిర్మిస్తున్న కారిడార్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, గల్లా జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణ కూడా హాజరయ్యారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వీరు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణలో ఇది తొలి గిగా ఫ్యాక్టరీ కావడం గమనార్హం. ఇది దేశంలోని అతి పెద్ద ఫ్యాక్టరీల్లో ఒకటి కాబోతోంది. 

మరోవైపు అమరరాజా గిగా ఫ్యాక్టరీపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈవీ, సస్టెయినబుల్ మొబిలిటీ రంగంలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఇదొక పెద్ద అడుగు అని కేటీఆర్ ప్రశంసించారు. రూ. 9,500 కోట్లతో ఈ గిగా ప్లాంట్ ను నిర్మిస్తున్నారని వెల్లడించారు. భారత్ లో ఈ రంగంలో ఇదొక భారీ పెట్టుబడి అని అన్నారు. మహబూబ్ నగర్ కు సంబంధించి అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ అని చెప్పారు. గిగా ఫ్యాక్టరీ కోసం తెలంగాణను ఎంపిక చేసుకున్నందుకు తన మిత్రుడు గల్లా జయదేవ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.
Galla Jayadev
Amara Raja
Giga Factory
KTR
BRS

More Telugu News