PM Modi: నేడు బెంగళూరులో మోదీ రోడ్ షో

The bond between Bengaluru and BJP is an old and strong one says PM Modi
  • ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ప్రధాని
  • బెంగళూరుకు బీజేపీకి బలమైన అనుబంధం ఉందని వ్యాఖ్య
  • తమ పార్టీ సిద్ధాంతం ఎప్పుడూ అభివృద్ధి చుట్టే తిరుగుతుందన్న మోదీ 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోకు సంబంధించి ప్రధాని ట్వీట్ చేశారు. బెంగళూరుకు బీజేపీకి మధ్య బలమైన అనుంబంధం ఉందని అందులో పేర్కొన్నారు. ఈ సిటీ మొదటి నుంచీ బీజేపీకి మద్ధతుగా నిలుస్తోందని అన్నారు. తమ పార్టీ సిద్ధాంతం ఎప్పుడూ అభివృద్ధి చుట్టే తిరుగుతుందని అన్నారు. కర్ణాటకలో గత నాలుగేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధాని మోదీ ఈ ట్వీట్ లో ప్రస్తావించారు. 

సామాజిక న్యాయ అంశాల్లో సున్నితంగా ఉంటామని, భవిష్యత్తుపై బీజేపీ స్పష్టమైన విజన్ కలిగి ఉందని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో బీజేపీ ట్రాక్‌ రికార్డ్‌, ఇప్పటి వరకు సాధించిన విజయాలను పరిశీలించాలని ప్రధాని కోరారు. బెంగళూరును అభివృద్ధి పథంలో నడిపిస్తూ కర్ణాటకను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడతామని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందించేందుకు మరోమారు బీజేపీని ఆశీర్వదించాలంటూ బెంగళూరు వాసులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. 

బెంగళూరు అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందిందని మోదీ అన్నారు. హెల్త్ కేర్, హౌసింగ్, పారిశుద్ధ్యం.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందుందని, ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని వివరించారు. ప్రజల అవసరాలను తీర్చేలా రహదారుల నిర్మాణం, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థల ఏర్పాటుతో పాటు డ్రైనేజీ వ్యవస్థ, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు మోదీ తెలిపారు. సాంకేతిక ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా బెంగళూరు స్థానాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తున్నట్లు వివరించారు.
PM Modi
Bengaluru
BJP
Road show
Karnataka
assembly elections

More Telugu News