MP Sushil Kumar: ముగ్గురు చైన్ స్నాచర్లను వెంటాడి పట్టుకున్న బీహార్ ఎంపీ

MP Sushil Kumar chased three chain snatchers successfully
  • మహిళ మెడలో గొలుసు లాక్కుని పారిపోయిన దొంగలు
  • ఎంపీని తుపాకీతో బెదిరించిన వైనం
  • ఏమాత్రం భయపడకుండా వెంటాడిన ఎంపీ
  • ఓ గ్రామం వద్ద బైక్ బురదలో కూరుకుపోయి కిందపడిన దొంగలు
  • అరకిలోమీటరు పరిగెత్తి పట్టుకున్న ఎంపీ బాడీగార్డులు
బీహార్ లో ఓ ఎంపీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దొంగలను వెంటాడి పట్టుకున్నారు. ఔరంగాబాద్ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ బరూన్ ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో సరిత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న అత్తగారిని పరామర్శించి, భర్త రాజేశ్ గుప్తాతో కలిసి తిరిగి వస్తోంది. అయితే, ముగ్గురు చైన్ స్నాచర్లు సరిత మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. 

ఇంతలో ఎంపీ సుశీల్ కుమార్ కాన్వాయ్ అటుగా వస్తోంది. మహిళ మెడలో గొలుసును దొంగలు లాక్కుపోవడం గమనించి, తన వాహనాన్ని దొంగలు వెళ్లినవైపు మళ్లించమని డ్రైవర్ కు చెప్పారు. దొంగల బైక్ కు దగ్గరగా ఎంపీ వాహనం వెళ్లగానే... ఎంపీ సుశీల్ కుమార్ ను కాల్చిపారేస్తామంటూ ఆ దొంగలు తుపాకీతో బెదిరించారు. 

అయినప్పటికీ ఎంపీ ఏమాత్రం భయపడకుండా వారిని ఛేజింగ్ చేశారు. చివరికి మధుపూర్ అనే గ్రామం వద్ద దొంగల బైక్ బురదలో కూరుకుపోయింది. దాంతో వారు బైక్ వదిలి పొలాల్లోకి పరుగు తీశారు. ఎంపీ తన అంగరక్షకులను అప్రమత్తం చేయడంతో, వారు దొంగల వెంట అరకిలోమీటరు పరిగెత్తి, ఎట్టకేలకు ఆ ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. ఆపై వారిని పోలీసులకు అప్పగించారు. 

వారి నుంచి ఒక ఫారిన్ మేడ్ పిస్టల్, ఒక ఇండియన్ మేడ్ హ్యాండ్ గన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురు చైన్ స్నాచర్లను ఆనంద్ కుమార్, టింకు కుమార్, ఠాకూర్ గా గుర్తించారు. కాగా, దొంగలను వెంటాడి మరీ పట్టుకుని, ఓ మహిళ బంగారు గొలుసును ఆమెకు అప్పగించిన ఎంపీని అందరూ అభినందించారు.
MP Sushil Kumar
Chain Snatchers
Chasing
Bihar

More Telugu News