Narendra Modi Stadium: వన్డే వరల్డ్ కప్: టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఖరారు!

  • గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-పాక్ మ్యాచ్ నిర్వహించే అవకాశం
  • అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ.. 7వ తేదీన దాయాదుల పోరు?
  • ఐపీఎల్ తర్వాత షెడ్యూల్ ప్రకటించనున్న బీసీసీఐ
Narendra Modi Stadium Likely to Host India vs Pakistan Clash in ICC World Cup 2023

క్రికెట్ ను ఆటగా కాకుండా మతంలా భావించే అభిమానులు ఉన్న మన దేశంలో.. టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగితే ఉండే క్రేజ్, ఉత్కంఠ, మజానే వేరు. దాయాదుల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఆద్యంతం హైవోల్టేజ్ తో సాగే ఈ పోరు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతుంది. ఇప్పుడు అలాంటి సందర్భమే రాబోతోంది. 

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లలో మన దేశంలోనే వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ షెడ్యూల్ తోపాటు భారత్, పాక్ మ్యాచ్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరు గాంచిన గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాయాదుల మ్యాచ్ను నిర్వహించే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.

టీమిండియా - పాక్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలి వస్తారు. ఇక మోదీ క్రికెట్ స్టేడియం.. ప్రపంచంలోనే అతిపెద్దది. లక్ష మంది సీటింగ్ సామర్థ్యం ఉంది. అందుకే అహ్మదాబాద్ లోని ఈ స్టేడియంలోనే ఇండియా- పాక్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ ముగిసిన వెంటనే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించనుంది. అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 7వ తేదీన భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్, నాగ్‌పూర్, అహ్మదాబాద్, బెంగళూరు, త్రివేండ్రం, ముంబై, ఢిల్లీ, లక్నో, గౌహతి, కోల్‌కతా, రాజ్‌కోట్, ఇండోర్, ధర్మశాల స్టేడియాలను ఎంపిక చేసినట్లు సమాచారం.

అయితే ఏడు వేదికల్లో మాత్రమే ఇండియా మ్యాచ్ లు ఉంటాయి. అందులో అహ్మదాబాద్ ఒకటి. ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. అయితే పాకిస్థాన్ టీమ్ మాత్రం భద్రతా కారణాల వల్ల చాలా వరకు మ్యాచ్ లను చెన్నై, బెంగళూరులోనే ఆడనున్నట్లు సమాచారం. అలాగే బంగ్లాదేశ్ కూడా ప్రయాణ సమయం తగ్గించుకునేందుకు కోల్ కతా, గౌహతి స్టేడియాల్లో మాత్రమే ఆడనున్నట్లు తెలుస్తోంది.

More Telugu News