Andhra Pradesh: వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం నిధుల విడుదల

AP cm jagan today released kalyanamastu and shadi tofa funds
  • 12 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.87 కోట్లు జమ
  • పదో తరగతి చదివి పద్దెనిమిదేళ్లు నిండిన వారికే పథకం వర్తింపు
  • ఉన్నత చదువులవైపు ప్రోత్సహించడంలో భాగంగానే ఈ రూల్ పెట్టామన్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లోని పేద కుటుంబాలలో యువతుల వివాహానికి అండగా నిలిచేందుకు తీసుకొచ్చిన వైఎస్సార్ కల్యాణమస్తు పథకం, వైఎస్సార్ షాదీ తోఫా పథకం నిధులను శుక్రవారం సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగన్ మాట్లాడారు. అనంతరం ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి మార్చి లోగా పెళ్లి చేసుకున్న 12,132 మంది కొత్త జంటల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.87.32 కోట్లు జమ చేశారు. దీంతో గత ఆరు నెలల్లో ఈ పథకం కింద 16 వేల మందికి పైగా లబ్ధిదారులకు మేలు చేశామని సీఎం జగన్ చెప్పారు. వీరందరి ఖాతాల్లో మొత్తంగా రూ.125.50 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా వధువు పదో తరగతి పూర్తి చేసి ఉండాలని సీఎం జగన్ చెప్పారు. ఈ నిబంధన పెట్టడానికి కారణం.. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి కాబట్టి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తారనేదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు కూడా ఇందుకు తోడ్పడతాయని తెలిపారు.

ప్రస్తుతం కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం ప్రయోజనం పొందుతున్న 12 వేలకు పైగా లబ్ధిదారులలో దాదాపు సగం మంది విద్యాదీవెన, వసతి దీవెన కూడా అందుకున్నారని తెలుస్తోందన్నారు. దీనర్థం.. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వారిలో దాదాపు సగం మంది డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.. లేదా డిగ్రీ చదువుతూ అయినా ఉండాలని అన్నారు. ఉన్నత చదువుల ద్వారా పేదరికాన్ని తరిమికొట్టవచ్చని సీఎం జగన్ చెప్పారు.

  • Loading...

More Telugu News