Etela Rajender: అధిష్ఠానం ఆదేశాలతోనే జూపల్లి, పొంగులేటిలతో భేటీ: ఈటల రాజేందర్

  • ఖమ్మంలో జూపల్లి, పొంగులేటిలను కలిసిన ఈటల బృందం
  • తమ అందరి లక్ష్యం ఒక్కటేనన్న ఈటల  
  • కేసీఆర్ నిరంకుశ పాలనను బొంద పెట్టే పార్టీ బీజేపీ మాత్రమేనని వ్యాఖ్య 
Etala Rajender asks Jupalli and Ponguleti to join BJP

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులది, తమ పార్టీ లక్ష్యం ఒక్కటేనని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఇద్దరి నేతలతో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల బృందం భేటీ అయింది. ఖమ్మంలో పొంగులేటి, జూపల్లిలతో భేటీ అయిన వారిలో ఈటల, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

భేటీ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ, పొంగులేటి, జూపల్లి, తమ లక్ష్యం అందరిదీ ఒక్కటేనని చెప్పారు. వీరిద్దరూ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కుటుంబ పరిపాలన అంతమొందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని చెప్పారు. ప్రధాని వాగ్దానం నెరవేర్చాల్సిన బాధ్యత అమిత్ షా, జేపీ నడ్డాలపై ఉందన్నారు. అధిష్ఠానం ఆదేశాలతోనే వీరిని కలిశామని, కేసీఆర్ నిరంకుశ పాలనను బొంద పెట్టే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. బీజేపీలో చేరాలని వారిని కోరినట్లు చెప్పారు. కేసీఆర్ డబ్బు సంచులతో కొనే ప్రయత్నం చేస్తున్నారని, కానీ అవి చెల్లవన్నారు.

More Telugu News