Brahmanandam: కర్ణాటక ఎన్నికల్లో కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం... వీడియో ఇదిగో!

Brahmanandam campaigns for BJP candidate in Karnataka elections
  • మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
  • చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారంలో పాల్గొన్న బ్రహ్మీ
  • ఆరోగ్య మంత్రి డాక్టర్ కె.సుధాకర్ కు ఓటు వేయాలంటూ ప్రచారం
  • బ్రహ్మానందంతో సెల్ఫీల కోసం పోటీలు పడిన ప్రజలు
కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రచార అస్త్రాలు బరిలో దించుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా కన్నడ నాట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ప్రచారం చేసింది బీజేపీ కోసం. ఇవాళ చిక్ బళ్లాపూర్ లో బ్రహ్మానందం సందడి చేశారు. తనదైన శైలిలో ఓటర్లను అకట్టుకునేందుకు ప్రయత్నించారు. 

చిక్ బళ్లాపూర్ నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బ్రహ్మీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. చిక్ బళ్లాపూర్ ప్రాంతంలో తెలుగు వారి ప్రాబల్యం ఉంది. దాంతో బీజేపీ పెద్దలు బ్రహ్మానందాన్ని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. 

రాష్ట్రంలో డాక్టర్ కె.సుధాకర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నో వినూత్న పథకాలు తీసుకువచ్చి, దేశం దృష్టి కర్ణాటకపై పడేలా చేశారని బ్రహ్మీ కొనియాడారు. తమలాంటి వాళ్లం ఇవాళ సుధాకర్ గారి కోసం ప్రచారం చేస్తున్నామని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. కాగా, రాత్రి 10 గంటల వరకు బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 

తెలుగు చిత్రసీమ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అంతటివాడు తమ ప్రాంతానికి రావడంతో చిక్ బళ్లాపూర్ లో సందడి నెలకొంది. బ్రహ్మానందాన్ని చూసేందుకు జనాలు తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు.
Brahmanandam
Election Campaign
Dr K Sudhakar
Karnataka
BJP
Tollywood

More Telugu News