Virender Sehwag: రిటైర్ మెంట్ నిర్ణయం తీసుకుంటే ధోనీనే చెబుతాడు కదా.. పదేపదే అడగడమెందుకు?: సెహ్వాగ్ అసహనం

  • రిటైర్ మెంట్ గురించి ధోనీని పదేపదే అడుగుతున్న వ్యాఖ్యాతలు
  • ప్రతిసారి అవే ప్రశ్నలతో ధోనీని ఉక్కిరిబిక్కిరి చేయడం సరి కాదన్న సెహ్వాగ్
  • అతడే సరైన సమయంలో వెల్లడిస్తాడని వ్యాఖ్య
sehwag unhappy over ms dhoni being asked about retirement in ipl

‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న అప్పట్లో ఎంత వినిపించిందో.. ‘ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు?’ అనే ప్రశ్న కూడా ప్రస్తుతం క్రీడా వర్గాల్లో అంతే వినిపిస్తోంది. చెన్నై ఆడే ప్రతి మ్యాచ్ కు ముందు, మ్యాచ్ తర్వాత ఇదే ప్రశ్న ధోనీకి ఎదురవుతోంది.

ధోనీ కూడా తన రిటైర్ మెంట్ పై హింట్ ఇస్తున్నట్లుగా మాట్లాడటంతో.. ప్రశ్నలు ఎక్కువయ్యాయి. నిన్నటి మ్యాచ్ సందర్భంగా ‘‘ఇది మీ చివరి సీజన్ కదా.. ఎంజాయ్ చేస్తున్నారా?’’ అని కామెంటేటర్ అడగ్గా.. ‘ఇదే చివరి సీజన్ అని మీరు డిసైడ్ చేసేశారా?’ అని నవ్వుతూనే ధోనీ కౌంటర్ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు. ప్రతిసారి అవే ప్రశ్నలతో ధోనీని ఉక్కిరిబిక్కిరి చేయడం సరి కాదని అసహనం వ్యక్తం చేశాడు. ధోనీ కూడా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. 

‘‘ప్రతిసారి ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతారో నాకు అర్థం కాదు. ఒకవేళ ఇదే అతడికి చివరి సీజన్‌ అయినా సరే.. మళ్లీ మళ్లీ అడగాల్సిన అవసరం ఏముంది? అది అతడికి సంబంధించిన విషయం. నిర్ణయం అతడినే తీసుకోనివ్వండి. ‘ఇదే నాకు చివరి సీజన్‌’ అని ధోనీ నుంచి సమాధానం రాబట్టాలని సదరు వ్యాఖ్యాత భావించాడేమో?’’ అని సెహ్వాగ్ అన్నాడు. ఇది చివరి సీజనా? కాదా? అనేది కేవలం ధోనీకి మాత్రమే తెలుసని చెప్పాడు. అతడే సరైన సమయంలో వెల్లడిస్తాడని అభిప్రాయపడ్డాడు.

More Telugu News