New Delhi: మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి.. లైవ్ లో కన్నీటి పర్యంతమైన మహిళా రెజ్లర్లు

  • నిన్న అర్ధరాత్రి జంతర్ మంతర్ వద్ద పోలీసులు, రెజ్లర్లకు మధ్య తోపులాట
  • నిద్రించేందుకు మంచాలను తీసుకొస్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్న రెజ్లర్లు
  • మద్యం మత్తులో ఉన్న పోలీసులు తమపై దాడి చేశారని ఆరోపణ
 Vinesh Phogat breaks down says cops pushed protesting wrestlers

బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు నిరసన తెలుపుతున్న జంతర్ మంతర్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన చేపట్టిన రెజ్లర్లకు, ఢిల్లీ పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీ పోలీసులు తమను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని మహిళా రెజ్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై దాడి చేశారని రెజ్లర్లు ఆరోపించారు. రెజ్లర్లు, పోలీసుల మధ్య జరిగిన తోపులాట తర్వాత వినేశ్ ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. 

‘వర్షం కారణంగా పరుపులు తడిసిపోయాయి.  దీంతో మేం నిద్రించడానికి మడత మంచాలు తీసుకువస్తున్నాం. కానీ, దీనికి పోలీసులు అనుమతించలేదు. ధర్మేంద్ర అనే పోలీసు అధికారి మమ్మల్ని నెట్టి వేశారు. ఇక్కడ కనీసం మహిళా పోలీసులు కూడా లేరు. లైంగిక ఆరోపణల కేసుపై ఎఫ్ఐఆర్ నమోదైన బ్రిజ్ భూషణ్ తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. మేం నిద్రపోడానికి మంచాలు తీసుకొస్తుంటే అడ్డుకొని మమ్మల్ని ఇలా అవమానిస్తారా? మేం మా గౌరవం కోసం పోరాడుతున్నాం. కానీ, ఇలాంటి రోజులు చూడ్డానికా మేం దేశం కోసం పతకాలు సాధించింది?’ అని వినేశ్ కన్నీటి పర్యంతమైంది. ‘ఓ పోలీసు  మమ్మల్ని తోసేసి, నెట్టాడు. వారు మమ్మల్ని బాధపెట్టిన తీరు తర్వాత దేశం కోసం ఏ అథ్లెట్ పతకం సాధించాలని నేను కోరుకోను. మీరు మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి’ అంటూ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేసింది.

More Telugu News