The Kerala Story: తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ విడుదలైతే నిరసనలు తప్పవు.. హెచ్చరించిన నిఘా వర్గాలు

  • ఇస్లాం పుచ్చుకుని ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన కేరళ మహిళల కథగా సినిమా
  • ట్రైలర్‌తోనే సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’
  • సినిమాను నిషేధించాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • రేపు దేశవ్యాప్తంగా విడుదల
  • అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించిన నిఘా వర్గాలు
Tamil Nadu on high alert ahead of The Kerala Story movie release

బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ట్రైలర్‌తోనే సంచలనం సృష్టించింది. విపుల్ అమృత్‌లాల్ షా ఈ సినిమాను నిర్మించారు. కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాం పుచ్చుకుని ఆపై కరుడుగట్టిన తీవ్రవాద గ్రూపు ఇస్లామిక్ స్టేట్‌లో చేరడం వంటి ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ సినిమాపై ట్రైలర్ తర్వాతి నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని పలువురు ప్రకటించారు. అయితే, తమ సినిమాలో అవాస్తవాలు లేవని, ఇప్పటి వరకు 32 వేలమంది మహిళలు మతం మారారని, యథార్థ ఘటనల ఆధారంగానే ఈ సినిమాను రూపొందించినట్టు చిత్ర బృందం చెబుతోంది.

తాజాగా ఈ సినిమాపై నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. తమిళనాడులో కనుక ఈ సినిమా విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఖాయమంటూ నిఘా వర్గాలు తమిళనాడు పోలీసు శాఖను హెచ్చరించాయి. ఫలితంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. కాబట్టి ముందుజాగ్రత్త చర్యగా తమిళనాడులో సినిమా విడుదల కాకుండా చూడాలని చెప్పింది. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీలతో ముఖ్యమంత్రి స్టాలిన్ చర్చించిన అనంతరం చర్యలు తీసుకుంటారని పోలీసుల వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ సినిమా రేపు (5న) దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

More Telugu News